సీమ ప్రోజెక్టుల విషయంలో జగన్ ఆశల మీద నీళ్లు చల్లిన కృష్ణ బోర్డు!

Pothireddy Padu Irrigation Project

అనుకున్నంత జరిగింది. కృష్ణ నది పై కొత్తగా ఏలాంటి పథకాలు నిర్మాణం చేట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్ర పడాలని కృష్ణ నదీ యాజమాన్య బోర్డు తేల్చి చెప్పింది. రాయలసీమకు కృష్ణ నదీ జలాలను పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ నీరు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుకు ప్రాథమిక దశలోనే అవాంతరాలు ఎదురౌతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతితో చేపట్టాలని పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకంచేపట్టేట్టుగా వుంటే తమకు తెలియజేయాలని రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి బోర్డు కార్యదర్శి హరి కేశ్ మీనా లేఖ రాయడం సంచనంగా మారింది. ఈ అడ్డంకి ఒక్క పోతురెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నట్టు ప్రకటించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం గుండ్రేవుల రిజర్వాయర్ తుదకు సీమ వాసుల చిరకాల డిమాండ్ యైన సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి వర్తించు తుంది.

రాష్ట్ర విభజన చట్టం మేరకు కృష్ణ నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏవైనా కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు దిండి రెండు ఎత్తిపోతల పథకాలు శర వేగంగా నిర్మించుతుంటే వీటిని అడ్డుకొనేందుకు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక దఫా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ పథకాలపై టిడిపి ప్రభుత్వం అప్పట్లో మౌనం దాల్చితే రైతులు కొందరు సుప్రీంకోర్టు కెక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కాని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఉద్యమం రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేయబడిన జీవోలు చూపెట్టి ఈ రెండు పథకాలు కొత్తవి కావని పాత ప్రాజెక్టులని వాదించారు. ఎట్టి నిర్ణయాలు చేయకనే సమావేశం ముగిసింది. గమనార్హమైన అంశమేమంటే టిడిపి ప్రభుత్వం మౌనంపై వైసిపి నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు నాయుడు మౌనం వహించారని ఆరోపించారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వ ఏం చేస్తుందో వేచి చూడాలి.

అప్పటి నుండి ఇంత వరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగ లేదు. ఇటీవల కాలంలో కేంద్రం ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు సిద్ధం కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమ రెండు రాష్ట్రాల మధ్య ఎట్టి తగాదాలు లేవని అపెక్స్ కౌన్సిల్ సమావేశం అవసరం లేదని కేంద్రానికీ లేఖ రాశారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం పాటించారు.

తిరిగి ఇటీవల అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పూర్వ రంగంలో తెలంగాణ బిజెపి నేత పొంగు లేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యేందుకు ప్రయత్నించగా ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది. ఇందులో పాలమూరు దిండి రెండు ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి రెండూ కొత్త పథకాలని రాష్ట్ర విభజన చట్టం 11 వ షెడ్యూల్లో లేవని వీటిని అడ్డుకోవాలని కోరింది.

ఈ పూర్వ రంగంలో రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 33 వేల కోట్ల రూపాయలతో కొన్ని కొత్త పధకాలు కొన్ని విస్తరణ పథకాల నిర్మాణం ప్రకటించింది. అందులో ప్రస్తుతం 44 వేల క్యూసెక్కులు విడుదల సామర్థ్యంతో వున్న పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ 80 వేల క్యూసెక్కులు విడుదలకు విస్తరించడం ఒకటి. వెనువెంటనే యాజమాన్య బోర్డు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ అటు వంటి ప్రతి పాదన వుంటే ముందుగా తమకు తెలియ జేయాలని అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్ర అవసరమని తెలిపింది. అంటే సిద్దేశ్వరం అలుగు రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్ర పడ వలసినదే.

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013