ప్రత్యర్థులను ఎత్తుగడల ద్వారా బోల్తా కొట్టించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద ఇక ఎవరైనా నేర్చుకోవలసినదే! ఉత్తరాంధ్రలో కీలక మైన విజయనగరం రాజ కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్టు బోర్డు నియామకంలో టిడిపి నేతలతో పాటు బిజెపి నేతలు కూడా ఖంగు తిన్నారు. అయితే ఈ ఉదంతం బిజెపి అధిష్టాన వర్గానికి తెలియకుండా జరిగిందా? అదే వాస్తవమైతే ఆమెపై పార్టీ పరంగా చర్యతీసుకుంటారా? రాజకోట రహస్యం మున్ముందు బహిర్గతం కాక తప్పదు. టిడిపి నేత అశోక్ గజపతి రాజును చైర్మన్ పదవి నుండి తప్పించి పైగా ఇన్నాళ్లు జాతీయ బిజెపి అధికార ప్రతినిధిగా ఢిల్లీలో వుండిన రాజాకుటుంబానికి చెందిన సంచయితను అనూహ్యంగా చైర్మన్ పీఠంపై కూర్చోపెట్టిన తీరు అపూర్వం.
ఎవ్వరూ పసిగట్టలేని విధంగా మంగళ వారం అర్థ రాత్రి రహస్య జీవో విడుదల చేసి తెల్లవారేకల్లా సంచయత చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
జరిగి పోయిన పెళ్లికి మేళం వాయించినట్లు ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి నేతలు ఇద్దరూ ఇన్నాళ్లూ తమ పార్టీ నేతగా వుండిన సంచయత పై మండి పడుతున్నారు. సహజంగా టిడిపి నేతలు నిరసనలు తెలపడం లేదా వారు చెబుతున్నట్లు న్యాయం పోరాటం చేయడం ఆశ్చర్య పడనక్కర లేదు. కాని ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ చైర్మన్ గా సంచయతను నియమించడం నియమ నిబంధనలకు విరుద్ధంగా వుందన్నారు. ఆమె బిజెపికి చెందినా ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ఈ నియామకంలో కుట్ర వుందన్నారు.
ఉత్తరాంధ్రకే చెందిన మరో బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మరో అడుగు ముందుకేసి రాజ వంశంలో రాక్షస క్రీడ జరిగిందని ఇప్పటికైనా సంచయత ఆలోచించుకోవాలన్నారు.ఇదంతా చూస్తుంటే ఈ కుట్ర కోణం వెనుక బిజెపి మరొక జాతీయ అధికార ప్రతినిధి జివియల్ నరసింహారావు హస్తం వుందని కొందరు భావిస్తున్నారు. మరో విశేషమేమంటే గురువారం రాష్ట్ర బిజెపి నేతలు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు పలికి వస్తే శుక్రవారం ఢిల్లీ నుండి పిలవని పేరంటం లాగా రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని నరసింహారావు ప్రకటన చేశారు.ఇంత పరస్పర విరుద్ధంగా మాట్లాడితే బిజెపి గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా నరసింహారావు పట్టించుకోలేదు.
బహుశా ఏ రాష్ట్రంలో కూడా బిజెపి ఇన్ని భిన్న స్వరాలతో వ్యవహరించి వుండదేమో. ఇంత పరస్పర విరుద్ధంగా నేతలు మాట్లాడుతూ ప్రజల ముందు అభాసుపాలౌతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పడం ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి? మరో వార్త ఏమంటే ఈ బోర్డులో అపర కుబేరుడు అంబానీ సభ్యులుగా వున్నారట. ఈ ట్రస్టు కింద 12716 ఎకరాల భూమి ఉందని ఇవి కాజేందుకు ఇంత హంగామా జరిగిందని జరిగే ప్రచారం పక్కన పెడితే ప్రత్యర్థులను అనుహ్యంగా ఏలా బోల్తా కొట్టించాలనో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద నేర్చు కోవలసినదే