చంద్రబాబు హయాంలో మన్సాస్ ట్రస్టుకి చెందిన వందలాది ఎకరాల భూములు మాయమైపోయాయంటోంది అధికార వైసీపీ. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని ప్రత్యేకంగా డీల్ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై ప్రతిరోజూ పెద్దయెత్తున విమర్శలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి.
అశోక్ గజపతిరాజుకి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వున్న పలుకుబడి గురించి కొత్తగా చెప్పేదేముంది.? విజయనగరం రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అశోక్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే.. అయినాగానీ, అశోక్ గజపతిరాజు ఇమేజ్ మాత్రం ఉత్తరాంధ్రలో ఇంకా అలాగే వుంది. అందుకే, సరిగ్గా ఆ ఇమేజ్ మీద దెబ్బ కొట్టాలనుకుంటోంది వైసీపీ.
ఈ క్రమంలోనే మన్సాస్ అక్రమాల్ని తెరపైకి తెచ్చింది. అయితే, మన్సాస్ నుంచి అశోక్ గజపతిరాజుని తొలగించిన తర్వాత ఏడాది కాలంలో వైసీపీ ఏం చేసింది.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎప్పుడైతే తిరిగి మన్సాస్ ట్రస్టుని అశోక్ గజపతిరాజు కోర్టు ఆదేశాలతో దక్కించుకున్నారో, ఆ తర్వాతే ఆ ట్రస్టుపై అవినీతి ఆరోపణలు షురూ అయ్యాయి. కబ్జా ఆరోపణలు తెరపైకొచ్చాయి.
ఈ వ్యవహారం అశోక్ గజపతిరాజుకీ పెద్ద తలనొప్పిగా మారింది. ట్రస్టు భూములంటే, అవి దోపిడీకి గురవడం సర్వసాధారణం. దేవాలయాల భూముల్ని రాజకీయ నాయకులు ఎప్పటినుంచో మింగేస్తూనే వున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా.. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా జరుగుతూనే వుంది. సో, మన్సాస్ విషయంలోనూ దోపిడీ జరిగే వుంటుంది.
ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందులో అశోక్ ప్రమేయం వున్నా లేకపోయినా, ఆయన ఇమేజ్ అయితే డ్యామేజ్ అయిపోవడం ఖాయం. అన్నట్టు, ప్రస్తుతం వైసీపీలో వున్న ఒకప్పటి టీడీపీ నేతలే ఎక్కువ కబ్జాలకు పాల్పడ్డారంటూ విశాఖలో ప్రచారం జరుగుతున్న దరిమిలా అది అధికార పార్టీ మెడకి చుట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.