ఈ నెల ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల సర్దుబాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తోంది. రాజ్యసభకు పంపాల్సిన అభ్యర్థులను పైనల్ చేయడంలో మల్లగుల్లాలు పడుతోంది. మండలి రద్దుతో ఇప్పుడు సీనియర్లంతా రాజ్యసభ సీట్లపైనే ఆశలు పెట్టుకోవడంతో ఎవరికి ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలి అనేదానిపైనా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ కోసం పాటు పడ్డవారు, భారీగా ఖర్చులు పెట్టిన వారు తమకు ఖచ్చితంగా సీటు కావాలని కోరుతుండటంతో అభ్యర్థుల ఎంపిక జగన్కు ఓ తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయోధ్యరామి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారు సీటు కోసం ఆశగా ఎదురు చూస్తుంటే.. ఇప్పటి వరకు ఏ పదవీ ఆశించకుండా పార్టీ విజయం కోసం కష్టపడిన జగన్ సోదరి వైఎస్ షర్మిళ కూడా రాజ్యసభ సీటు కావాలని కోరుతున్నారట. జగన్ జైల్లో ఉన్న సమయంలోనూ పార్టీ కోసం షర్మిళ చాలా కష్టపడ్డారు. కాబట్టి షర్మిళకు సీటు గ్యారెంటీ అని అంతా అంటుంటే పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
ఎన్డీఏకు రెండు సీట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించారని, అందులో ఒకటి ముఖేష్ అంబాని సూచించిన పరిమల్ నత్వానికి ఒక సీటు ఖాయమైందని సమాచారం. మరి ఇంకోటి ఎవరికి అన్నది రహస్యంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితుల్లో సోదరి షర్మిళకు జగన్ సీటు ఇచ్చి రాజ్యసభకు పంపుతారా అన్నది అనుమానంగానే ఉంది. సీనియర్లను బాధపెట్టం ఇష్టలేక, అలాగే పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారికి సీట్లను కేటాయించి ఈ సారికి ఏదో ఒకలా షర్మిళకు నచ్చజెప్తారేమో అని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. మరి జగన్ తన సోదరికి ఎలా న్యాయం చేస్తారో..!