తులాభారం ఎటు వేపు మొగ్గడం లేదు. అందరూ ఢిల్లీ వేపు వేయి కళ్లతో చూస్తున్నారు. కాని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అంతుబట్టని విధంగా వ్యవహరిస్తోంది. అధికార ప్రతిపక్షాలకు నరాలు తెగే ఉత్కంఠ కల్పిస్తోంది.శాసన మండలి రద్దు అయితే గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను ప్రతి పాదించిన మూడు రాజధానుల అమలు చేయ లేరు. అదే సమయంలో ప్రతి పక్షాల పంతం కన్నా రాజధాని రైతులు 76 రోజులుగా చేస్తున్న ఆందోళన కొంత మేరకైనా సఫలం కావాలంటే కీలక మైన శాసన మండలి కొనసాగాలి. ఇరు పక్షాలకు శాసన మండలి రద్దు వ్యవహారం జీవన్మరణ సమస్యగా మారింది. శానస మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపి నెల రోజులు అవుతున్నా కేంద్రంలో ఏమాత్రం కదలిక లేదు. మంగళవారం నుండి పార్లమెంటు ఉభయ సభలు రెండవ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆమోదించే బిల్లులు అంశాలు ఇటీవల అధికారుల సమావేశం ఖరారు చేసింది . అందులో శాసన మండలి రద్దు అంశం లేదు.
ఈ పరిణామం రాజధాని రైతులకు రాష్ట్రంలో ప్రతి పక్షాలకు పెద్ద ఊరట ఇచ్చింది.అయితే సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సప్లిమెంటరీ లేక టేబుల్ అయిటమ్ గా శాసన మండలి రద్దు బిల్లు పెట్టే అవకాశముంది. ఈ వెసులుబాటు పైననే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకొని వున్నారు.ఇప్పటికే ముఖ్యమంత్రి రెండు దఫాలుగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి హోంమంత్రులను కలసి విన్నవించి వున్నారు. అయితే తమకు రాజకీయంగా ఏమాత్రం ప్రయోజనం లేనిదే మోదీ షా ద్వయం ఇంత వరకు ఎప్పుడూ ఏ చర్య తీసుకున్న సందర్భంలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది సంక్లిష్టమైన సమయమే. ఎందుకంటే కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ల కోర్కెలన్నీ తీర్చాలి. అప్పుడే రాష్ట్ర బిజెపి నేతలతో సహా అన్ని ప్రతిపక్షాలను నిలువరించ గలరు. ప్రధానంగా రాజధాని అంశానికి ముగింపు పలక గలరు.
మరో వేపు కేంద్రంలోని పెద్దల కోర్కెలు తీర్చితే రాష్ట్రంలో తనకు 2019 లో లభించిన ప్రజా మద్దతు చాలా పోగొట్టుకోవలసి వలసి వుంటుంది. మంచైనా చెడైనా తను తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల అమలుకు ఢిల్లీ పెద్దలకు దాసోహమంటారా? లేక ప్రజల అండకే సిద్ద పెడతారా? ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏవైఖరి తీసుకుంటారో చూద్దాం.