శవ రాజకీయాలతో బిజీ బిజీ

ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లటమే టార్గెట్ తో చంద్రబాబునాయుడు చాలా బిజీగా ఉంటున్నారు. చలో ఆత్మకూరు డ్రామా అయిపోగానే వెంటనే శవ రాజకీయాలు మొదలుపెట్టేశారు.  నెల్లూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య గడ్డివాము కోసం గొడవ జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త రెండు కుటుంబాల మధ్య వివాదంగా మారిపోయింది.

ఎప్పుడైతే చిన్న గొడవలో కుటుంబాలు కూడా దూరిపోయాయో వెంటనే ఒక వ్యక్తిపై మరో కుటుంబసభ్యులు చేసిన దాడితో అతను మరణించాడు. గడ్డవాము కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య  జరిగిన దాడిలో ఎవరిది తప్పో ఎవరు చెప్పలేరు. అయినా ఘర్షణ పెరిగిపోవటం, కుటుంబం దాడి చేయటం ఓ వ్యక్తి మరణించటం వెంటవెంటనే జరిగిపోయింది.

మధ్యాహ్నం వరకూ సదరు ఘర్షణను, వ్యక్తి మరణాన్ని బయటవాళ్ళెవరూ పట్టించుకోలేదు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా టిడిపి నేతలు రంగంలోకి దిగేశారు. టిడిపి సానుభూతిపరునిపై వైసిపి నేతలే దాడి చేశారంటూ గోల మొదలుపెట్టేశారు.  దాంతో వ్యక్తుల మధ్య ఘర్షణ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఇంకేముంది వెంటనే చంద్రబాబు కూడా రంగంలోకి దూకేశారు. బాధిత కుటుంబానితో ఫోన్లో మాట్లాడేశారు. మృతుని కుటుంబానికి రూ 5 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించేశారు.

విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపటంతో అసలు విషయం బయటపడింది. ఎప్పుడైతే కేసు పోలీసుల చేతిలోకి వెళ్ళిందో మళ్ళీ టిడిపి నేతలెవరూ అడ్రస్ లేరు అక్కడ. ఆమధ్య కూడా ఇలాగే జరిగింది. ఓ టిడిపి కార్యకర్త హత్యకు గురయ్యారు. వైసిపి నేతలు చేసిన హత్యే అంటూ గగ్గోలు పెట్టేశారు చంద్రబాబు, టిడిపి నేతలు. తీరా చూస్తే అది అక్రమ సంబంధం గొడవ.

టిడిపి కార్యకర్తకు ఓ వివాహితురాలితో ఉన్న సంబంధం బయటపడటంతో కుటుంబ సభ్యులే హత్య చేశారు. అప్పుడు కూడా విషయం బయటపడిన తర్వాత టిడిపి నేతలెవరూ మళ్ళీ నొరిప్పలేదు. ఇపుడేమో ఇలాగ. మొత్తానికి చంద్రబాబు శవ రాజకీయాలతో బిజీ బిజీగా గడేపిస్తున్నారు.