వైసీపీకి రెబల్స్ షాక్ ఇవ్వనున్నారా!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అధిష్టానానికి ఆ పార్టీ శ్రేణులు షాక్ ఇస్తున్నాయి. నేర చరితులకు సీట్లు ఇవ్వబోమని పార్టీ అధినేత జగన్ ప్రకటించినా.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో దానికి విరుద్ధంగా జరుగుతోంది అంటూ.. ఆ పార్టీ నేతలు కొందరు ఆందోళనలకు దిగుతున్నారు. గుంటూరులో హోంమంత్రి సుచరిత ఇంటిని కార్యకర్తలు ముట్టడించారు. విశాఖలో దాడి వీరభద్రరావును సైతం దీనిపై నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదని గుంటూరు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్‌లో ఓ వార్డును రౌడీషీటర్‌ ఎలా ఇచ్చారంటూ.. హోంమంత్రి సుచరితను ప్రశ్నించారు. చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖలోనూ వైసీపీ అసంతృప్తులు రోడ్డున పడ్డారు. వార్డు సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి అంటూ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి నినాదాలు చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి కష్ట, నష్టాలలో ఉన్న కార్యకర్తలను వదిలేసి, వేరే పార్టీల నుండి వచ్చిన వారికి సీట్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు ఎన్నికల వాయిదా, కొందరు నేతల మాటలతో ఇబ్బంది పడుతోన్న వైకాపా అధిష్టానానికి ఇప్పుడు ఇదొక పెద్ద చిక్కుగా మారినట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు అసమ్మతి నేతలు కూడా దాడి మొదలెడితే ఎ రెబల్స్‌ గొడవ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఆ పార్టీ నేతలే.. ఇప్పుడు సీఎంను ప్రశ్నిస్తూ వ్యతిరేక నినాదాలు చేయడం, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్పందించి, అసమ్మతులను బుజ్జగిస్తేనే స్థానిక పోరు సజావుగా సాగుతుంది.