వైసిపి నేతకు షాక్ తప్పదా ?

ఈమధ్యనే వైసిపిలో చేరిన మాజీ ఎంఎల్ఏ తోట త్రిమూర్తులకు షాక్ తప్పేలా లేదు. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసి వైసిపిలో తోట చేరిందే కేసులనుండి తప్పించుకునేందుకు. అయితే అధికార పార్టీలో చేరినా కేసు మాత్రం తోటను వదిలేట్లు లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే 1996 సంవత్సరంలో రామచంద్రాపురం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో దళితులకు, కాపులకు మధ్య పెద్ద గొడవైంది. ఆ సందర్భంగా కొందరు దళితులను పట్టుకుని  కాపు నేతలు శిరోముండనం చేయించారు. దళితులకు శిరోముండనం పేరుతో రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. తర్వాత దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనలతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోలసుల విచారణలో తోట త్రిమూర్తులుతో పాటు మరికొందరు శిరోముండనానికి ప్రధాన కారణంగా తేలటంతో అందరిపైనా కేసులు పెట్టారు. అప్పటి నుండి అంటే దాదాపు 23 సంవత్సరాలుగా ఈ కేసు తోట తదితరలను  వెంటాడుతునే ఉంది. కేసులో ఎటువంటి పురోగతి ఉండకూడ చూసుకోవటం కోసమే తోట అధికారపార్టీలోనే ఉంటుంటారు. టిడిపిలో చేరినా అంతే ఇపుడు వైసిపిలో చేరిందీ అందుకే అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఎప్పుడైతే తోట వైసిపిలో చేరారో తమ ఊరికివచ్చిన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను బుధవారం దళితులు నిలదీశారు. వారితో పిల్లి మాట్లాడుతూ తమకు తోటకన్నా దళితులే ముఖ్యమని చెప్పారు. కేసు నుండి ప్రభుత్వం ఎట్టి పరిస్దితుల్లోను తోటను రక్షించదని కూడా ప్రకటించారు. దాంతో తోటకు శిరోముండనం కేసులో ఇబ్బందులు తప్పేట్లు లేదని అర్ధమవుతోంది.