వైఎస్ అభిమానులకు జగన్ ఏం సమాధానం చెప్తారు?

అనుకున్నదే జరిగింది… మీడియాలో జరిగిన ప్రచారం నిజమైంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ని పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కలవడం వెనుక కారణం తన మిత్రుడికి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడానికే అని జరిగిన ప్రచారం నిజమైంది.

అయితే ఇప్పుడు వైసీపీలోని దిగువ స్థాయి నేతలు, కేడర్ లో ఒక చర్చ మొదలైంది. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అకాల మరణం వెనుక ఇదే అంబానీ ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కూడా ఈ ఆరోపణలు చేశారు. ఆ సమయంలో రిలయన్స్ మాల్స్ మీద కొన్నిచోట్ల దాడులు కూడా జరిగాయి. దానిపై రిలయన్స్ సంస్థ కేసులు కూడా పెట్టింది.

అయితే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి జగన్ రిలయన్స్ కంపెనీ వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆ సంస్థ వైసీపీ కేడర్ మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ నాటి ప్రచారం నిజమని నమ్మి… ఇప్పటికి నమ్ముతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఏమని జవాబు చెప్తారు?

రిలయన్స్ కంపెనీ వ్యక్తికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తన తండ్రి మరణంతో ఆ సంస్థకు సంబంధం లేదని జగన్ పరోక్షంగా చెప్పినట్లు అయింది. రిలయన్స్‌‌కి సంబంధం లేదంటే వైఎస్ మరణం విషయంలో కాంగ్రెస్‌కి కూడా సంబంధం లేనట్లే. ఎందుకంటే కాంగ్రేస్ అధినేత్రి సోనియా సూచనలతోనే రిలయన్స్ అంబానీ మార్గదర్శనంలో వైఎస్ ని చంపించారని నాటి నుంచి నేటి వరకు వైసీపీ ప్రచారం చేసుకుంది. మరి ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఏకంగా రాజ్యసభ సీటునే కేటాయించింది. అంటే ఇప్పుడు అదంతా అబద్దం అని జగన్ స్వయంగా చెప్పినట్లు అయింది