వివేకా హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.  వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ  నేత ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా.. ఏడాది గడుస్తున్నా వివేకా హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.  

పులివెందుల పీఎస్‌ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించిన న్యాయస్థానం సీఎం జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణ ప్రభావం కేసుపై ఉండకూడదని సూచించింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

ఇక 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం విధితమే. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి సొంత బాబాయి కావడంతో ఈ హత్య రాజకీయంగా పెను సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో హత్యపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ విచారణ వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వివేకా హత్య కేసును సిట్‌తోనే విచారించాలని నిర్ణయించింది. అయితే, వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.