వివేకా హత్యకేసులో కీలక ట్విస్టు

జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు  కీలక మలుపు తిరిగింది. వివేకా హత్యకు ప్రొద్దుటూరులోని సునీల్ గ్యాంగ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది.  వివేకా హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాలు దాదాపు 800 మంది సాక్ష్యులను, అనుమానితులను విచారించినట్లు సమాచారం.

మొత్తానికి వివేకా హత్యను  సుపారీ హత్యగానే పోలీసులు తేల్చేశారు. ప్రొద్దుటూరులోని సునీల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చినట్లు అనుమానితునిగా ఉన్న కడపకు చెందిన శ్రీనివాసరెడ్డి ఈమధ్యనే ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో సుపారి ఇచ్చింది ఎందుకు ? ఎవరి తరపున ? అన్న విషయాలు తేల్చేందుకు మరికొంత సమయం పట్టేట్లుంది.

సుపారీ తీసుకున్న గ్యాంగ్ లోని వ్యక్తులు వాడిన మోటారు బైక్ ఆధారంగా మొత్తం గ్యాంగ్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. వివేకా హత్య కేసులో పోలీసులు కీలకమైన ఆధారాలు లభించటంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారనే చెప్పాలి. టిడిపి ప్రభుత్వం ఉన్నపుడు జరిగిన హత్య అప్పట్లో సంచలనమైన విషయం తెలిసిందే.

జరిగిన హత్య కూడా ఎన్నికల సమయంలో కావటంతో కలకలం రేగింది. దాంతో హత్యకు మీరే కారణమంటే కాదు మీరే కారణమని టిడిపి, వైసిపి నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటంతో ఘటన రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. చంద్రబాబు హయాంలో అయినా ఇపుడు జగన్ హయాంలో కూడా కేసు విచారణలో పెద్దగా పురోగతి కనిపించలేదని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా కీలక ఆధారాలు దొరకటం గమనార్హం.