వివాదాల్లో ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం

ఐఎఎస్ అధికారిగా పలు కీలక అధికార పదవుల్లో పని చేసి తుదకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా వుంటూ పదవీ విరమణ చేసిన అజయ్ కల్లం తన ఉద్యోగకాలంలో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకో లేదు. అంతేకాదు. చంద్రబాబు నాయుడు హయాంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై గళం విప్పి పలు సభల్లో ప్రసంగాలు చేసినపుడు కూడా ఆయన సామాజిక వర్గం గురించి ప్రస్తావన రాలేదు. టిడిపి తప్ప మిగిలిన అన్ని పార్టీల వారు ఆయన ప్రసంగించిన సభలకు హాజరయ్యే వారు. . ఆయన ప్రసంగాల్లో టిడిపి పాలనలో చోటు చేసుకుంటున్న అవకతవకలు అవినీతి వ్యక్త మయ్యేటివి గాని వైసిపి పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తున్నారనే భావన కలగ లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కాకుంటే టిడిపి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసేవారు. ఎప్పుడూ చెలియలికట్ట దాట లేదు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సలహా దారుగా చేరిన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకో లేదు. కాకుంటే వైసిపి ప్రభుత్వం పలు కోర్టు కేసుల సందర్భంగా ఎదురు దెబ్బలు తింటుంటే ఇంత అనుభవం వున్న అజయ్ కల్లం సలహాదారుగా వుండి కూడా ఏం చేస్తున్నారనే భావన పలువురితో వుండేది. ఈ అంశంపై కూడా భిన్నాభిప్రాయాలు వుండేటివి.

ఈ నేపథ్యంలో తొలి దఫా విద్యుత్ కొనుగోళ్లు అంశంపై మీడియా సమావేశం పెట్టి మాట్లాడంతో అధికార పదవిలో వుండి ప్రభుత్వం నుండి జీత భత్యాలు తీసుకుంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదనే అభిప్రాయం వెల్లడైంది. అంత వరకైతే ఫర్వాలేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెల్లో జరిగిన రాజకీయ సభలో పాల్గొనడమే తొలి అభ్యంతరం అయితే ఆ సభలో చేసిన ప్రసంగం మొత్తంగా వివాదాస్పద మైంది.

ఇవన్నీ అటుంచి తన ప్రసంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అమరావతిలో భూములు కొను గోలు చేశారన్న వ్యాఖ్య పెద్ద దుమారమే రేపు తోంది. దీనిపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సుప్రీంకోర్టు సూమోటోగా గాని లేక ఎవరైనా కోర్టు కెక్కితే ఏలాంటి ఆధారాలు లేకుండా రాజ్యాంగ బద్ద పదవుల్లో వున్న వారిపై ఆరోపణలు చేసి నందుకు కేసు నమోదయ్యే అవకాశముందని కూడా భావిస్తున్నారు.