విద్యుత్ కోతల పాపమెవరిది ?

వర్షాకాలంలో విద్యుత్ కోతలుండటం చాలా అరుదు. భారీ వర్షాల వల్లో లేకపోతే తుపాను ప్రభావం వల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అది వేరే సంగతి. కానీ అటువంటిది ఏమీ లేకపోయినా సుమారు ఏడు జిల్లాల్లో విద్యుత్ కోతలున్నాయంటే కచ్చితంగా ప్రభుత్వ చేతకానితనమనే భావించాలి.

ఉభయగోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీగా కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు కూడా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటలవరకు ఉండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. అసలే భారీ వర్గాల వల్ల దోమలతో అంటు వ్యాధులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలోనే కరెంటు కోతలు అందులోను రాత్రుళ్ళంటే ఇక జనాల బాధలు చెప్పనక్కర్లేదు.

పిపిఏల సమీక్ష పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీల నుండి విద్యుత్ తీసుకోవటం ఆపేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో భారీ వర్గాల వల్ల సింగరేణిలో బొగ్గు తవ్వకాలు కూడా తగ్గిపోయింది. దాంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఇలా అన్నివైపుల నుండి విద్యుత్ ఉత్పత్తి సమస్యలు చుట్టుముట్టడంతో కోతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

సరే ఈ సమస్యలన్నింటికీ కారణం ఎవరైనా బాధితులు మాత్రం మామూలు జనమనే విషయాన్ని గుర్తించాలి. ఇందుకు కచ్చితంగా జగన్ దే బాధ్యతగా చూడాలి. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం, పిపిఏలను  సమీక్ష చేయాలని అనుకునే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకపోవటం లాంటివి జగన్ చేసిన తప్పిదాలే. కాబట్టి సమస్యలను వీలైనంత తొందరగా అధిగమించకపోతే ఇబ్బందులు తప్పవని జగన్ గ్రహించాలి.