ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సిఎఎ కి వ్యతిరేకంగా NPR NRC అమలును అడ్డుకుంటూ జరుగుతున్న పోరాటం 68 వ రోజుకు చేరుకొన్నది. ఢిల్లీ ఎన్నికలు పోలింగ్ రోజు కూడా ఉద్యమం సాగిస్తునే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేసి వచ్చారు. తుదకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలుసు కొనేందుకు ఆయన ఇంటికి బయలుదేరిన ఉద్యమకారులను పోలీసులు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని నిరసనలకు హద్దు వుంటుందని వ్యాఖ్యానించి ఉద్యమ కారులతో మాట్లాడేందుకు మధ్య వర్తులను నియమించింది. ఈ పోరాటం ఇప్పట్లో అంతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మధ్య వర్తులుగా వచ్చిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను నిరసనకారులు ప్రశ్నతో ముంచెత్తారు జామియాలో తమ పిల్లలయెడల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆవేదన వెలు బుచ్చారు. తమ రక్షణకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. గురువారం కూడా చర్చలు జరిగాయి.
అదే తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి రాజధాని రైతులు ప్రధానంగా మహిళలు ఉద్యమం ప్రారంభించి 64 రోజులు అయింది. రెండు నెలలు గడుస్తున్నా వీరిలో ఏమాత్రం పట్టుసడల లేదు. ఢిల్లీలోని షహీన్ బాగ్ నిరసన కారులతో చర్చలు జరిపినట్లు అమరావతి రైతులతో మాట్లాడే వారు కనిపించడం లేదు. .
రాష్ట్ర మంత్రులు లేదా వైసిపి నేతలు చెబుతున్నట్లు ఇది టిడిపి నిర్వహించే ఉద్యమమే అయివుంటే ఈపాటికి ఎప్పుడో చప్ప చల్లారి పోయి వుండేది. వాస్తవంలో ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో వైసిపికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అమరావతి రైతులు పైగా మహిళలు సాగిస్తున్న ఉద్యమ స్పూర్తి లక్ష్య శుద్ధి పక్కన బెడితే అది వైసిపి ప్రభుత్వం చెబుతున్నట్లు కృత్రిమ స్వభావం కలిగి రియల్ ఎస్టేట్ ప్రేరేపితమై వుంటే కేవలం పోటీ కాళ్లపై నిర్వహింపబడుతూ వుంటే ఈ ఉద్యమం రెండు నెలలకు పైగా ఇన్నాళ్లు బతికి బట్ట కట్టేది కాదు.
బుధవారం రోజు భూముల సర్వే కోసం ఆ ప్రాంతానికి ఒక యంఆర్ఓ వస్తే ఆ అధికారిణిని కారు దిగకుండా ఉద్యమ కారులు ప్రధానంగా మహిళలు నాలుగు గంటలు చుట్టుముట్టారు. మరు రోజు కల్లా 426 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహిళ రైతులు అధికారిణిని ఘెరావ్ చేయడం పోలీసులు కేసు నమోదు చేయడంలోని ఉచితానుచితాలు పక్కన బెడితే గురువారం రోజు SRM యూనివర్శిటీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైసిపి ఎమ్మెల్యే రోజాను మహిళలతో పాటు ఉద్యమ కారులు చుట్టుముట్టి రాజధాని అంశంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. తుదకు పోలీసులు వచ్చి ఆమెను పంపివేశారు.
ముందుటి రోజు రివిన్యూ అధికారిని ఘెరావ్ చేసినందుకు 426 మందిపై కేసులు నమోదు కాగా మరు రోజు తిరిగి మహిళలు పరుగులు తీసి ఎమ్మెల్యే రోజా ను అడ్డగించారంటే ఆ ప్రాంత మహిళలు ఢిల్లీ షహీన్ బాగ్ ఉద్యమ కారులను మించిపోయారని భావించాలి. మహిళలు కూడా అరెస్టులకు కేసులకు గురించి ఏ మాత్రం జంకే పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వం వేపు నుండి సంప్రదింపులకు ఎట్టి చొరవలేదు. రాష్ట్రంలో అన్ని ప్రతిపక్షాలు అమరావతి రైతుల పోరాటాన్ని బలపర్చుతూ వున్నందున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే వారు లేకపోయారు. ఢిల్లీ లోని షహీన్ బాగ్ ఉద్యమం విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవడమొక్కటే మిగిలి వుంది.