ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సమర్ధవంతమైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతోంది. చంద్రబాబు నాయుడు అన్నీ తానై చూసుకునే పరిస్థితులు లేవు. వయసుమీద పడుతోంది.. మరోవైపు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌పై బాధ్యతలు పెట్టాలన్నా.. ఆయన సామర్ధ్యంపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాల ఉన్నాయి. కొందరు సమర్థిస్తున్నా.. మరి కొందరు మాత్రం తీవ్రంగా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా లోకేష్ వల్ల గల్లా జయదేవ్ కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
లోకేష్ నాయకత్వంపై ఉన్న అనుమానాలు ఇప్పటివి కావు.. ఆయనపై వస్తోన్న ఆరోపణలు కూడా ఇప్పటి కావు. తెలుగు దేశం పార్టీ నేతల్లో చాలా మంది లోకేష్ ఇగో వల్ల ఇబ్బంది పడటం, తర్వాత సర్దుకు పోవడం జరుగుతున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల పార్టీ నుండి వెళ్లిపోయిన ఓ ఎమ్మెల్యే కూడా లేకేష్ తీరుపై చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు. కేవలం ఆయన వల్లే పార్టీని వీడి పోవాల్సి వచ్చిందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. తాజాగా గల్లా జయదేవ్ విషయంలోనూ లోకేష్ అనవసర రాజకీయ సమస్యలు తెస్తున్నారని టాక్ వినబడుతోంది.
ఇటీవల లోకేష్ యువ నేతలతో లంచ్ మీటింగ్ పెట్టిన విషయం విధితమే. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువనేతలతో లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడు గల్లా జయదేవ్‌కు కోపం తెప్పించాయట. మంగళగిరిలోనే ఉంటున్నాను.. ఏవైనా సమస్యల ఉంటే నా వద్దకు రండి.. అని లోకేష్ నేతలకు చెప్పడం ఓ ఊహించని షాక్ ఇచ్చిందని సమాచారం.
గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ.. కాబట్టి అన్ని నియోజకవర్గాల సమస్యలను ఆయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు. కాని లోకేష్ ఇప్పుడు మధ్యలో ఇలా నేతలతో అనేసరికి గల్లా షాక్ అయ్యారట. తనను కార్నర్ చేయడానికి చూస్తే వెంటనే పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సీరియస్ అయ్యారట. అయితే మధ్యలో కేశినేని నాని జోక్యం చేసుకుని ఈ సమస్యను సద్దుమణిగేలా చేసినట్లు టాక్. అయితే మంగళగిరి విషయంలో గతంలోనూ లోకేష్ ఇదే విధంగా జయదేవ్‌ను ఇబ్బంది పెట్టినట్లు టాక్ వచ్చింది. ఇప్పుడు మరోసారి లోకేష్ అదే చేయడం టాక్ గా మారింది.