లిక్కర్ పై జగన్ డేరింగ్ డెసిషన్

ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించిన జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ నుండి బార్ల సంఖ్యను కూడా తగ్గించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే కాకుండా పాదయాత్ర సందర్భంగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే హామీల అమలుకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ముందు షాపుల సంఖ్యపై దృష్టిపెట్టారు.

జగన్ సిఎం అయ్యేనాటికి రాష్ట్రంలో సుమారు 3 వేల మద్యం షాపులున్నాయి. మొన్ననే జరిగిన మద్యం షాపుల వేలం పాటలో దాదాపు 700 షాపులను తగ్గించేశారు. అదే సమయంలో మద్యం ధరలను బాగా పెంచేశారు. షాపుల్లో రిఫ్రిజిరేటర్ల సౌకర్యాన్ని ఎత్తేశారు. ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్లు ఎత్తేశారో బీర్ల వినియోగం తగ్గిపోతుంది. ఎందుకంటే చల్లగా లేకపోతే బీర్లను ఎవరూ తాగలేరు. దాంతో బీర్లు కొనేవారి సంఖ్య కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

ఇక జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే లిక్కర్ షాపులు, బార్లు, దాబాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. దాని వల్ల మద్యం తీసుకుని డ్రైవింగ్ చేసే వారి సంఖ్య కొంతైనా తగ్గుతుందన్నది జగన్ ఆలోచన. దాని వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అదే సమయంలో  ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులను నడపాలని నిర్ణయించారు. ఎవరి ఆధ్వర్యంలో షాపులు నడిచినా ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే అమ్మకాలు చేయాలని నిబంధన తెచ్చారు.