కరకట్ట మీద అక్రమనిర్మాణం ఓనర్ లింగమనేని రమేష్ కు వేధింపులు ఎదురవుతున్నాయా ? తాజగా జగన్మోహన్ రెడ్డికి లింగమనేని స్వయంగా రాసిన ఓపెన్ లెటర్ ప్రకారం అవుననే అనుకోవాలి. ఇంతకీ లింగమనేనికి ఎదురవుతున్న వేధింపులేమిటి ? ఏమిటంటే తాను చంద్రబాబునాయుడుకు బినామీనంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారమవుతోందట. దాంతో తనకే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా మానసికంగా వేధిపులకు గురవుతున్నారట.
నిజానికి మానసిక వేధింపుల విషయంలో లింగమనేని చెబుతున్నది ఎంత వరకూ నిజమో ఎవరికీ తెలీదు. ఎందుకంటే చంద్రబాబుకు లింగమనేని బినామీ అనే ప్రచారం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలైంది కాదు. ఎప్పుడైతే లింగమనేని అక్రమనిర్మాణాన్ని చంద్రబాబు నివాసంగా మార్చుకున్నారో అప్పటి నుండే బినామీ ప్రచారం మొదలైంది.
కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాగంటే చంద్రబాబు సిఎం కాగానే అప్పటి మంత్రి దేవేనేని కరకట్ట మీద నిర్మించిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలే అంటూ వరుసగా అన్నింటికీ కూల్చివేతల నోటీసులిచ్చారు. ఇందులో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. కాబట్టి లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణమే అని కొత్తగా ఎవరు చెప్పాల్సిన పనిలేదు.
అయితే తెరవెనుక ఏమి జరిగిందో ఏమో ? తర్వాత సీన్ మారిపోయి కూల్చివేత నోటిసు అందుకున్న భవనంలోకి ఏకంగా చంద్రబాబు మకాం పెట్టేశారు. దాంతో లింగమనేని-చంద్రబాబు మధ్య ఏదో బంధం మొదలైందనే ప్రచారం ఊపందుకుంది. అందుకనే చంద్రబాబుకు లింగమనేని బినామీ అంటూ ప్రచారం మొదలైంది.
అంటే జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు, లింగమనేనే బాధ్యత వహించాల్సుంటుంది. చంద్రబాబు సిఎంగా ఉన్నంత కాలం ప్రచారంపై నోరెత్తని లింగమనేని ఇపుడు మాత్రం తెగ బాధపడిపోతున్నట్లు బిల్డప్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.