చంద్రబాబునాయుడు, చినబాబులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్ధమవుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎంతసేపూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనబడుతోంది. రైతు రుణమాఫీకి సంబంధించి జీవో నెంబర్ 38ని రద్దు చేయటం ద్వారా జగన్ రైతు ద్రోహిగా మిగిలిపోయారంటూ నారా లోకేష్ తన ట్విట్టర్ లో చెప్పటమే విచిత్రంగా ఉంది.
2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది చంద్రబాబు. 2019 ఎన్నికల సమయంలో రుణమాఫీ మొత్తం చేసేసినట్లు చెప్పి రైతులను మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నించింది కూడా చంద్రబాబే.
సరే ఒకసారి మోసపోయారు కాబట్టి రెండోసారి చంద్రబాబుకు రైతులు గూబ గుయ్యిమనిపించారు. దాంతో వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో రైతుల కోసం రైతు భరోస అనే పథకాన్ని జగన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే రైతు ప్రయోజనాల కోసం అనేక చర్యలు తీసుకుంటున్న జగన్ రైతు భరోసాను ఎప్పటి నుండి అమలు చేస్తున్నది ప్రకటించారు.
ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి రైతులను మోసం చేసింది చంద్రబాబు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం అమలుకు కృషి చేస్తున్నది జగన్. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. అలాంటిది రైతులను మోసం చేసిన చంద్రబాబే రైతు ద్రోహిగా ముద్ర వేసుకున్నారు. తన తండ్రి మీద పడిన ముద్రను చెరిపేసేందుకు జగన్ పై రైతు ద్రోహిగా ముద్ర వేయాలని లోకేష్ ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది.