రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు

అమరావతి రాజధాని రైతుల ఆందోళన బుధవారంతో 63 రోజులకు చేరుకున్నది. అయినా వారిలో ఉద్యమ స్పూర్తి ఏ మాత్రం సడల లేదు. మహిళలే మొత్తం ఉద్యమం మోస్తున్నారు.

ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా మరో సమస్యకు తెర లేచింది. రాజధాని గ్రామాల ప్రజల్లో చీలిక తెచ్చేందుకు కావచ్చు. లేదా ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ కార్యక్రమం కింద కావచ్చు. రాజధానికి ఇచ్చిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రివిన్యూ అధికారులు సర్వేకు ఉపక్రమించారు. దీనితో ఇంత వరకు రాజధాని కోసం వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించుతుండిన మహిళలు రివిన్యూ అధికారులను అడ్డుకోవడంతో మరింతగా ఉద్రిక్తత నెలకొంది. ఇది శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తుందేమో. అధికారుల విధులకు అడ్డు తగిలారని అరెస్టుల పర్వం మున్ముందు మొదలు కావచ్చు.

ఇదిలా వుండగా తన ఆదేశాలను పాటించలేదని శాసన మండలి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని గవర్నర్ కు మండలి చైర్మన్ షరీఫ్ మెమోరాండం ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలపడం సరికొత్త మలుపు. రాజకీయ నాయకులులాగా మండలి కార్యదర్శి నిబంధనల ప్రకారం వ్యవహరించారని ఆయనపై ఒత్తిడి తేవడం సరికాదని మండలి కార్యదర్శికి అండగా వుంటామనివీరు ప్రకటన చేశారు.పైగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి ఫిర్యాదు చేశారు. ఇంత వరకు వైసిపి టిడిపి పార్టీల మధ్య నడుస్తుండిన పోరులో సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం సరి కొత్త మలుపు.

రోజు రోజుకు ఉధృతం అవుతున్న రాజధాని వివాదం నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్ర ప్రకాశం జిల్లాలో బుధవారం ప్రారంభించారు. తొలి రోజు బాగానే జనం వచ్చారు. గత అయిదు ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అధికారంలో వుండి అధికారులు తరలించే జనంను ఉద్దేశించి ప్రసంగించే వారు. జనం వారంతట వారు వచ్చిన సభలు లేవు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదు ఏళ్లు ప్రజల మధ్య గడిపి నందున ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా సభలు సమావేశాలు నిర్వహణకు శ్రీ కారం చుట్టారు. వాస్తవంలో చంద్రబాబు నాయుడు 45 రోజుల్లో అన్ని జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనలో ప్రజల స్పందన ఏలా వుంటుందో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతి పాదనతో వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ వాదం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పర్యటనలో వివిధ జిల్లాలో ప్రజల స్పందన ఏలా వుంటుందో బహిర్గతమైతే రాజధాని వివాదం గురించి ప్రజల నాడి అవగతం చేసుకోగలం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టుకోవడం కూడా ఒక విధంగా మంచిదే అవుతుందేమో. అయితే అదే సమయంలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా ఏర్పడే ప్రమాదం లేక పోలేదు.