ఏపీలో రాజకీయ బురదతో హోలీ! అయినా ఎవ్వరికీ నో హ్యాపీ!

హోలీ పండుగలో రకరకాలైన రంగులు ఒకరికొకరు చల్లుకొని హ్యాపీగా గడుపుతారు. కాని ఆంధ్ర ప్రదేశ్ హోలీ పండుగను మించి బురదను అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు చల్లుకుంటున్నారు. కాని ఏ ఒక్కరూ హ్యాపీగా లేరు.ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు ఇప్పటిది కాదు. అయితే పులి మీద పుట్రలాగా నిమ్మగడ్డ ప్రసాద్ ఎపిసోడ్ వచ్చిపడింది. ఇది ఎంత వరకు నిజమోగాని ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తోంది. ప్రస్తుతానికి ఇవేవీ పీకల మీదకు రాకున్నా మూడు రాజధానుల ప్రతి పాదన అమలు చిక్కుముడిలా తయారైంది.

దీనికి తోడు శాసన మండలి రద్దు కొరకరాని కొయ్యగా తయారైంది. ముందుగా శాసన మండలి రద్దు అయితే వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లులు బయటపడితే మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు పోయేందుకు మార్గం సుగమం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద అందుకు చెందిన ఫైలు కదిలినట్లు సమాచారం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్రీ అంతా శాసన మండలి రద్దు అంశంపైననే వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ప్రతి పాదనను వెనక్కి తీసుకొనే అవకాశం లేనందున కేంద్రం కోరిన కోర్కెలన్నీ తీర్చి ముందుకు పోక తప్పడం లేదు. అందుకూ ప్రతి బంధకాలున్నాయి. సిఎఎ చట్టం వ్యతిరేకించుతూ శాసన సభ తీర్మానం చేయాలనే డిమాండ్ స్వంత పార్టీలో వస్తోంది. తెలంగాణలో తీర్మానం ఆమోదించారు. అట్టి తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఆమోదించితే శాసన మండలి రద్దు అటకెక్కుతుంది. కేంద్రం కన్నెర్ర చేస్తుంది. దానితో మూడు రాజధానుల ప్రతి పాదన ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో ప్రతి పక్షాలు ప్రధానంగా టిడిపి పట్ల పైచేయి సంపాదించుకున్నా ప్రభుత్వ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది.

ప్రధాన ప్రతి పక్షం టిడిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడు ముందు తరచూ ఆత్మరక్షణలో పడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానుల ప్రతి పాదనతో పాటు శాసన మండలిలో టిడిపి షాక్ ఇచ్చినా అధికార పగ్గాలు చేతిలో వున్న ముఖ్యమంత్రి ఎత్తు ముందు తనే షాక్ కు గురైంది. ESI ఆసుపత్రుల్లో సంభవించిన కుంభకోణంలో పరోక్షంగా మాజీ మంత్రి అచ్చమ నాయుడు ఇరుక్కోవడం టిడిపిని డిఫెన్స్ లో పడవేసింది. నేరం రుజువు అవుతుందా నిజంగానే ఆయన ప్రమేయం వుందా లేదా అనే అంశాలు పక్కన బెడితే ఈ లోపు ఒంటికి అంటుకున్న బురద కడుగుకోవడంతో సరిపోతుంది. వైసిపి పై శాసన సభలో ఒంటి కాలిపై లేచే అచ్చమ నాయుడు స్పీడ్ తగ్గించబడుతుంది.అదే విధంగా అయిదు ఏళ్ల టిడిపి పరిపాలనపై వేయబడిన విచారణ ఎంత వరకు పని చేస్తుందో లేదో అనే అంశాలు పక్కన బెడితే మాటమాట కు ముఖ్యమంత్రి ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కడం గురించి టిడిపి నేతలు చేసే విమర్శల జోరు తగ్గక తప్పదు. తన లాగా చంద్రబాబు నాయుడును కూడా దోషిగా చూపెట్టేందుకు ముఖ్యమంత్రికి ఒక ఆయుధం దొరికింది.

ప్రతిపక్షాలపై ఎంతో కొంత విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రికి సంపూర్ణ విజయం సిద్ధిచడంలేదు. ప్రతిపక్షం ఏదొక విధంగా అడ్డంకులు సృష్టిస్తుంది.ఆ విధంగా చూస్తే రాష్ట్రంలో ఆఖండ ప్రజా విజయం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాపీగా లేరు. అదే సమయంలో తనకన్నా చాలా జూనియర్ అయినా ముఖ్యమంత్రి ఎత్తులకు పై ఎత్తులు వెయ్యలేక చంద్రబాబు నాయుడు గాని టిడిపి నేతలు గాని హాపీగా లేరు. అందరూ వారి వారికి తగ్గట్టు చిక్కుల వలయంలో చిక్కుకొని వున్నారు