ఉల్లిపాయలు కోస్తున్నపుడే కాదు కొంటున్నపుడు కూడా కళ్ళల్లో నీళ్ళుస్తొన్నాయి. దేశమంతా ఉల్లిగడ్డల ధరలు సుమారు 80 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉంటున్నది. అదే ఏపిలో మాత్రం ఉల్లిపాయల ధర 25 రూపాయలే. మొత్తం రాష్ట్రంలోని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను 25 రూపాయలకే అమ్ముతున్నారు.
దేశం మొత్తం అంత ధరలుంటే ఏపిలో మాత్రం ఎందుకింత తక్కువగా ఉందంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీసుకున్న చర్యలనే చెప్పాలి. మహారాష్ట్ర, కర్నాటక లాంటి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉల్లిపాయలను కొనుగోలు చేసి సబ్సిడి ధరలపై జనాలకు అందిస్తోంది ప్రభుత్వం.
ఇప్పటికి సుమారు 300 టన్నుల ఉల్లిపాయలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్లకు పంపిణీ చేసినట్లు సమాచారం. ధరలు ఆకాశంలోకి ఎగబాకటం, పొరుగు రాష్ట్రాల్లో కూడా కొరతగా ఉండటం తదితర కారణాల వల్ల ఏపిలో మనిషికి కిలో మాత్రమే అమ్ముతున్నారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి అనేక ప్రాంతాల్లో రైతుబజార్లకు టన్నుల కొద్ది ఉల్లిపాయలను చేర్చటంతో కనీసం మనిషికి కిలో ఉల్లిపాయలనైనా దొరుకుతోంది. తక్కువ ధరలకే ఉల్లిగడ్డలు దొరుకుతుండటంతో చాలా చోట్ల ఆడవాళ్ళే కనీసం ఐదు కిలోలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే కిలోకన్నా ఎక్కువ ఉల్లిపాయలు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యింది.