రాజకీయ అవినీతిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి !

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వెల్లువెత్తిన అవినీతి తన పాలనలో కూడా పునరావృత్తం కాకూడదని పలు కఠిన చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు. తనపై అక్రమాస్తుల కేసులు వున్నందున వాటి ఛాయలు కనిపించ కూడదని కూడా ఈ జాగ్రత్త తీసుకొంటున్నారేమో.

గత ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి ఒక కారణమైన అవినీతి మరక తనకూ చుట్టుకోకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారులకు తొలుతనే గట్టి హెచ్చరికలు చేశారు. . తరచూ జిల్లా కలెక్టర్లతో మాట్లాడే సందర్భంలో ప్రభుత్వంపై అవినీతి మచ్చపడకుండా చూడాలని కోరిన సందర్భాలున్నాయి. కాని క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా వుంది. అధికారుల అవినీతి రాజకీయ అవినీతితో పెనవేసుకొని వున్నందున అవినీతి నిర్మూలన అంత సులభం కాదు.

ముఖ్యమంత్రి ఇటీవల రాష్ట్ర ఎసిబి చీఫ్ ను మార్పు చేసి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. తదుపరి రాష్ట్రంలో ఎసిబి అధికారులు దాడులు తీవ్ర తరమయ్యాయి. తొలుత రివిన్యూ ఆఫీసులు తదుపరి రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు జరిగాయి. తదుపరి గత మూడు రోజుల క్రితం ఎసిబి అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండేసి మున్సిపాలిటీలను ఎంచుకొని టవున్ ప్లానింగ్ విభాగంలో దాడులు సాగించారు. ఈ సందర్భంగా పలు అవకతవకలు జరిగినట్లు పరిశీలనలో వెల్లడైనట్లు ఎసిబి అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ లాంటి దాడుల వలన ప్రభుత్వ యంత్రాంగంలో ఒక విధమైన భయం ఏర్పడటం సహజం

అయితే రాష్ట్రంలో అవినీతి భూతం కేవలం అధికార యంత్రాంగంలో మాత్రమే వుందని ముఖ్యమంత్రి భావిస్తే పప్పులో కాలు వేసినట్లే. అధికార యంత్రాంగాన్ని అంటి పెట్టుకొని కవల పిల్లలుగా రాజకీయ నేతల్లో అవినీతి భూతం వెర్రితలలు వేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగా రాజకీయ అవినీతి అదుపు చేస్తే అధికార యంత్రాంగంలో అవినీతి సులభంగా నిర్మూలించవచ్చు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అందరూ స్వఛ్చంగా వున్నారని క్షేత్రస్థాయిలో భిన్నంగా వుండే వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించకపోతే దీర్ఘకాలికంగా ఎట్టి సత్ఫలితాలు లభించవు.

రాజకీయ అవినీతి అంశాన్ని ప్రతిపక్షాల ఆరోపణగా ముఖ్యమంత్రి కొట్టి పారేస్తే రోగాన్ని దాచి పెట్టడమౌతుంది. వాస్తవంలో ముఖ్యమంత్రి ఎంత కట్టడి చేసినా కొందరు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అధికారుల పోస్టింగ్ లకు చేతులు చాచడం కాదనలేని సత్యం. ఎక్కువ నియోజకవర్గాల్లో కీలకమైన స్థానాల్లోనికి వచ్చే ప్రతి అధికారి స్థానిక ఎమ్మెల్యే అనుమతితో వచ్చి జాయిన్ అవుతున్నారు. ఫలితంగా ఆ అధికారులు తాము ముట్ట జెప్పిన డబ్బు తిరిగి రాబట్టుకొనేందుకు విధిగా అవినీతికి పాల్పడక తప్పడం లేదు. ఇందుకు రుజువులు ఎవ్వరూ చూప లేరు. ఈ పురాణ మంతా ఎంత దాచినా ఆ నోట ఈ నోట పడి చాపకింద నీరు లాగా ప్రజలకు చేరుతూనే వుంది. దీనివలన అప్రతిష్ట మూటకట్టుకోవలసి వస్తుంది.

ఇటీవల మంత్రాలయం శాసన సభ్యులు నాగిరెడ్డి వాస్తవమే చెప్పారు. వాలంటీర్లను నియమించే సమయంలోనే డబ్బులు చేతులు మారాయి. ఇప్పుడు వసూళ్లకు ప్రేరేపించుతున్నారు. 2014 ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే అధికారుల బదిలీలు జరిగాయి. ఈ సందర్భంలో డబ్బులు చేతులు మారాయి. మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంలో తిరుపతిలో జరిగిన ఒక సభలో ఉద్యోగ సంఘాల నేత ఒకరు (పేరు వద్దు లెండి) మాట్లాడుతూ ముందుగా రాజకీయ అవినీతి నిర్మూలించితే అధికారుల అవినీతి కట్టడి చేయడం సులభమన్నారు. ఉద్యోగులంతా అవినీతిపరులు కాదు. ఆలాగే ప్రజా ప్రతినిధులంతా ఉత్తములు కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కీలెరిగి వాత పెడితే మంచిది.