మొదటి టెండర్ లోనే జగన్ సూపర్…చంద్రబాబుకు షాక్

రివర్స్ టెండర్ విధానంలో వైసిపి ప్రభుత్వం ఒపెన్ చేసిన మొదటి ప్యాకేజి వర్కులోనే జగన్మోహన్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాలను తగ్గించే ఉద్దేశ్యంతో జగన్ రివర్స్ టెండర్ విధానాన్ని అవలంభించాలని నిర్ణయించారు. అయితే జగన్ ను తప్పు పడుతూ ఇటు కేంద్రప్రభుత్వం అటు చంద్రబాబునాయుడు ఒకటే రెచ్చిపోతున్న విషయం అందరకీ తెలిసిందే.

ఈ నేపధ్యంలో పోలవరం పనుల్లో  65వ ప్యాకేజికి పిలిచిన రివర్స్ టెండర్లను మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెనీ దక్కించుకుంది. టెండర్లలో పాల్గొన్న మిగిలిన కంపెనీలతో పోల్చుకుంటే మ్యాక్స్ 15.6 శాతం తక్కువకే ధరలను కోట్ చేయటంతో ఈ కంపెనీకే పనులు దక్కాయి. అంటే 274 కోట్ల రూపాయల పనుల్లో 15.6 శాతం తక్కువంటే సుమారు 58 కోట్లు ప్రభుత్వానికి మిగిలిందన్నమాట.

విచిత్రమేమిటంటే ఇదే మ్యాక్ కంపెనీ చంద్రబాబు హయాంలో ఇదే వర్కును 4.77 శాతం ఎక్కువ ధరలకు దక్కించుకుంది. చంద్రబాబు హయాంలో ఎక్కువ ధరలకు ఎందుకు కోట్ చేసింది ? జగన్ హయాంలో తక్కువకే ఎందుకు కోట్ చేసింది ?  ఈ ఒక్క ప్యాకాజీ పనులను చూస్తేనే చంద్రబాబు హయాంలో ఏ స్ధాయిలో ప్రజాధనం దోచేసుకున్నారో అర్ధమైపోతోంది.

రివర్స్ టెండర్ విధానంలో జగన్ సాధించబోయేది ఏమీ లేదని చంద్రబాబు గురువారం కూడా బల్లగుద్ది మరీ సవాలు చేశారు. అది రివర్స్ టెండర్ కాదని రిజర్వు టెండర్ మాత్రమే అంటూ ఆరోపించారు. మరి తాజాగా రివర్స్ టెండర్ విధానంలో ప్రభుత్వానికి ఆదా అయిన రూ. 58 కోట్ల విషయంలో చంద్రబాబు, కేంద్రం ఏమి సమాధానం చెబుతాయి ? ఒక్క ప్యాకేజీలోనే రూ. 58 కోట్లు మిగిలితే వేల కోట్ల ఇతర పనుల్లో ఇంకెంత మిగులుతుందో ?