మూడు రాజధానులు ఓట్లు రాలుస్తాయా? అమరావతిలో టీడీపీ ఎందుకు ఓడినట్లు?

రాష్ట్రంలో రాజధాని రగడ తారా స్థాయికి పోయింది. రాజధానికి అభివృద్ధికి ముడి పెట్టి వాదప్రతివాదాలు సాగు తున్నాయి. పరిపాలన వికేంద్రీకృతం చేస్తే గాని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా అభివృద్ధిని కేంద్రీకృతం చేసి వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిని దెబ్బ తీశాడని కూడా ఆరోపిస్తున్నారు. కాగా పరిపాలన వికేంద్రీకృతం చేసినంత మాత్రాన వెనుక బడిన ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యం కాదని ఉపాధి కల్పన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల జీవన ప్రమాణం పెంచే చర్యలు చేపట్టాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమని ప్రతి పక్షాలు చెబుతున్నాయి

ఈ వాదోపవాదాలు పక్కన బెడితే మూడు రాజధానుల ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఏమేరకు లబ్ది పొందుతారు? ఇది మాత్రం బిలియన్ డాలర్ల ప్రశ్నే.. విశాఖలో రాజధాని పెట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంతంలో తిరుగు లేని పలుకుబడి ఏర్పడటం వాస్తవమైతే అమరావతి రాజధాని చుట్టు పక్కల గల గుంటూరు కృష్ణ జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడి పోయింది? అంతేకాదు ఈ రోజు అమరావతి రాజధాని మార్పు చేయ వద్దని రోడెక్కి ఆందోళన చేస్తున్న మంగళగిరి తాడి కొండ నియోజకవర్గాల్లోని ఓటర్లు టిడిపి అభ్యర్థులను ఎందుకు ఓడించారు? వైసిపి అభ్యర్థులను ప్రజలు ఎందుకు గెలిపించారు? అంతేకాదు చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికే పరిమితమౌతున్నారని నేడు కొందరు వైసిపి నేతలు ఆరోపించుతున్నారు. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అధికంగా గల ప్రాంతాల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొండటమే కాకుండా వైసిపి అభ్యర్థులకు పలు నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ఓట్లు వేయకుండా వుంటే 151 మంది శాసనసభ్యులు గెలుపొందే వారా?

అసలు సమస్య అదికాదు. చంద్రబాబు నాయుడు అయిదు ఏళ్ల కాలంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలు రాజకీయ అవినీతి జన్మ భూమి కమిటీల పేర ప్రభుత్వానికి పార్టీకి మధ్య గల సరళ రేఖ చెరిపేసినందున 2004 లాగా అవకాశం కోసం ఎదురు చూచిన ప్రజలు చంద్రబాబు నాయుడును పని గట్టుకొని ఓడించారు. 2019 ఎన్నికల ఫలితాల తీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఘనత అనుకుంటే పప్పులో కాలు వేసి నట్లే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపులో తన లెక్కలు తన కుంటాయి. కాని రాజధాని విశాఖకు తరలించినంత మాత్రన ఏదో బావుకుంటామని భావిస్తే చంద్రబాబు నాయుడు అనుభవాన్ని మరుగు పర్చడమౌతుంది. ప్రజలు తమ జీవితాలను రూపాయలు పైసల్లో లెక్కలు వేసుకుంటారు. ప్రభుత్వం విధానాలతో సాధారణ ప్రజలు తమ జీవితాల్లో ఏదైనా మెరుగుదల వుందా? అని చూస్తారు. రాజధాని పెట్టి లేదా హైకోర్టు పెట్టినంత మాత్రాన దానితోనే సంత్రుప్తి పడి ఓట్లు గుమ్మరిస్తారనుకోవడం భ్రమ మాత్రమే. అయితే సమాజంలో ఉపరితల భాగంలో వుండే నోరుగల తరగతుల గొంతు మాత్రం ఈ ధోరణి విన్పించుతుంది అయితే అది గీటురాయి కాదు. అట్టడుగున వుండే నిద్రాణ శక్తులు సమయం వచ్చినప్పుడు తమ ప్రతాపం చూపుతాయి. వీరే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు గుణపాఠం నేర్పారు. దురదృష్టం ఏమంటే నేడు వైసిపి ప్రభుత్వం గుణపాఠాలు పరిగణనలోనికి తీసుకోవడం లేదు. జన్మభూమి కమిటీలు పోయి వాలంటీర్లు వచ్చారు. మున్ముందు వీరి వ్యవహార సరళే గ్రామ స్థాయిలో వైసిపి పరువు కాపాడ బోతోంది. దీనికి తోడు ప్రభుత్వం ప్రజలకు ఒకటి ఇచ్చి రెండు పీకేస్తోంది. ఇది ఎక్కడికెలుతుందో వేచి చూడాల్సిందే.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013