ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీ నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీ నామినేషన్ల ప్రక్రియ నేటి సాయంత్రంతో ముగిసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ, 9,984 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడుపు ఉంది. 21న పోలింగ్, 24న కౌటింగ్ జరుగుతుంది.

నామినేషన్లకు చివరి రోజు కావడంతో కార్యాలయాలన్నీ అభ్యర్థులతో సందడిగా మారాయి. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌కు గురైంది. ఇక్కుర్తిలో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళా అభ్యర్థిని కిడ్నాప్‌ చేశారు. నామినేషన్‌ పత్రాలు చించివేసి అభ్యర్థిని వదిలేశారు. దీనిపై బాధితురాలు ఏఎస్పీకి ఫిర్యాదు చేసింది. నరసారావుపేటలోనూ టీడీపీ, జనసేనకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులు సద్దుమణిగేలా చేసారు.

అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలంలోనూ ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌కు వచ్చిన టీడీపీ నేతల్ని పోలీసులు వెనక్కి పంపినట్లు, బత్తలపల్లికి రాకుండా పరిటాల శ్రీరామ్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా పుంగనూను మండలంలో నామినేషన్‌ వేయడానికి వచ్చిన జనసేన అభ్యర్ధి పత్రాలను కొందరు చించేశారు. టీడీపీ అభ్యర్ధులను సైతం అడ్డుకున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా పోలీసులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు.