మాజీ మంత్రి సిద్ధా వ్యూహం అదేనా..?

ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన టీడీపీ నేత, మాజీ మంత్రి, సిద్ధా రాఘవరావు రాజకీయ భవిష్యత్తుపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. చాలా కాలంగా అధికార పార్టీ నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ.. టీడీపీలోనే కొనసాగుతున్నా.. ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినబడుతోంది. మరో రెండు మూడు రోజుల్లో పార్టీ మారేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని గుసగుసలు గుప్పుమంటున్నాయి.

టీడీపీకి ఆర్థిక వెన్నుదున్నుగా ఉండే నాయకుడు, వైశ్య సామాజిక వర్గంలో పేరున్న నేత సిద్ధా రాఘవరావు తమ పార్టీలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన అధికార వైకాపాకు బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి రాగానే ఆ దిశగా పావులు కదిపినా సిద్ధా నుండి పెద్దగా స్పందన రాలేదట. దీంతో వైకాపా సిద్ధా ఆర్థిక మూలాలపై దృష్టి సారించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సిద్దా రాఘవరావు, వారి కుటుంబ సభ్యుల గ్రానైట్ వ్యాపారాల్లో ఉన్నారు కాబట్టే.. వారిని టార్గెట్ చేసుకుని గ్రానైట్ వ్యాపారులపై విజిలెన్స్ దాడులు జరిగినట్లు, ముఖ్యంగా ఒక్క సిద్ధా కుటుంబానికే రూ.900 కోట్ల ఫైన్ వేసినట్లు కూడా టాక్ వచ్చింది. దాని వల్లే సిద్ధా వ్యూహాత్మకంగా తన అన్న కుమారులను వైకాపాలోకి పంపారని, పార్టీ మారకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు.

అయితే మరో వైపు సిద్దా బీజేపీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు కానీ ఆ పార్టీలో కూడా చేరలేదు. మరి ఇప్పుడు అన్న కుమారులను వైకాపాలోకి పంపడం.. చూస్తుంటే.. ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు అది ఏది అన్నది మరో రెండు, మూడు రోజుల్లో తేలిపోతుందని టాక్.. మరి సిద్ధా తన రాజకీయ భవిష్యత్తుకు ఏ పార్టీని ఎంచుకుంటున్నారో.. ఎందులో చేరుతున్నారో.. ఆయనే చెప్పాలి.