హైదరాబాద్‌లో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాడంటూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాబు మాకు సలహాలు మానుకో అని ఏపీ అధికార పక్ష నేతలు అంటుంటే… బాబు ఇప్పుడు ఏకంగా కేసీఆర్‌ని కూడా కెలికాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను భువనగిరి ఏయిమ్స్ తరహాలో టిమ్స్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు.. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తానే కట్టించానని… ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1500 పడకల కరోనా ఆస్పత్రిగా సిద్ధం కావడం ఆనందంగా ఉందని అనేశారు.
అయితే దీనిపై కేసీఆర్ ఇంకా ఏ వ్యాఖ్యలూ చేయలేదు కానీ.. వైకాపా కార్యకర్తలు కొందరు.. మాత్రం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన శిలాఫకలం ఫొటో పెట్టి బాబుపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి చంద్రబాబు అన్న మాటలకు కేసీఆర్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో..?
అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పంట నష్టాలతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏపీలో క్వారంటైన్ లో ఉన్నప్పుడే మనుషులు చనిపోతున్న విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. పనిలో పనిగా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్నప్పుడు ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ను ఎలా ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారో అని కూడా ప్రశ్నించారు.
ఇప్పటికే బాబుపై తీవ్రంగా మండిపడుతున్న ఏపీ నేతలు.. ఇప్పుడు బాబు చేసిన తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో.. చూడాలి.