మచిలిపట్నం రేవును తుంగలో తొక్కేసిన చంద్రబాబు

(కొలనుకొండ శివాజీ*)

మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని తుంగలో తొక్కడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం క్రిష్ణా జిల్లాకు తీరని అన్యాయం చేస్తుంటే బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని, జిల్లా మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు చోద్యం చూస్తున్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధ పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్‌ ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఇంగితం కూడా వీరికి లేకపోయింది. కడప ఉక్కు కర్మాగారం కోసం వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న తోటి ప్రజాప్రతినిధులను పరామర్శించడానికి వెళ్లడం కాదు.. సంఘీభావంగా ర్యాలీలు చేయడం, నిరసన ప్రదర్శనలు చేయడం కాదు.. వారిని చూసైనా వీరు సిగ్గు తెచ్చుకుని మచిలీపట్నం పోర్టు కోసం ఉద్యమించాలి. కాంగ్రెస్‌ హయాంలో పోతిరెడ్డిపాటు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు కృష్ణా నీటిని తరలిస్తే డెల్టా గొంతు కోశారంటూ గగ్గోలు పెట్టిన వారికి ఇప్పుడు చేవ చచ్చిందా అని అడుగుతున్నా? కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తున్న వారికి సంఘీభావంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టిన అధికార పార్టీకి మచిలీపట్నం పోర్టు కనిపించడం లేదా?
అసలు మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి 1800 ఎకరాల భూములు చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక పోర్ట్ణు నిర్మాణం, దాని అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం వేలాది ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంత రైతులను భయభ్రాంతులను చేశారు. నాలుగేళ్ల పాటు సంబంధిత రైతు కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేసిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భూముల డీనోటిఫై అంటూ ఇప్పుడు నాటకాలాడుతున్నారు. ఇది కేవలం ఎన్నికలలో నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో చేసిన ప్రకటన తప్ప మరొకటి కానే కాదని ప్రజలు గ్రహించారు.
తెలుగుదేశం ప్రభుత్వానికి పోర్టు నిర్మించాలన్న చిత్తశుద్ధి లేదు. లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వ స్వాధీనంలో వున్న భూముల్లో నిర్మాణాన్ని ఎందుకు ముమ్మరం చేయడం లేదు?
పోర్టు నిర్మాణంతో పాటుగా దశలవారీగా అనుబంధ పరిశ్రమలకు భూములు సమీకరిస్తే.. రైతుల భూములకు సరైన ధర వచ్చేది. అమరావతిలో మాదిరిగా రైతులనుంచి ముందుగానే భూములు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ దందా చేద్దామని ప్రభుత్వం కుటిలయత్నం చేసినందునే బందరు ప్రాంత రైతులు పోర్టు కోసం భూములిచ్చేందుకు నిరాకరించారని భావించాల్సి వస్తోంది. కేంద్రప్రభుత్వం దుగరాజపట్నంలో పోర్టు నిర్మించడానికి అవకాశాలేవని చెబితే ప్రత్యామ్నాయంగా అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకుండా రామాయంపట్నం ప్రాంతాన్ని ఎందుకు ప్రతిపాదించిందని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం కమీషన్లు దండుకునే
ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తోంది తప్ప ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరే పనులు చేయడం లేదనడానికి మచిలీపట్నం పోర్టు ప్రత్యక్ష్య నిదర్శనంగా నిలుస్తుంది.
కృష్ణా జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులకు ఈ ప్రాంత ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా కలిసొచ్చే పార్టీలు, వ్యక్తులతో కలిసి మచిలీపట్న పోర్టు కోసం ఉద్యమించాలి. లేకుంటే గెలిపించిన ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారు.

(*రచయిత, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడు)