మంత్రుల వల్లే జగన్ కు తలనొప్పులు

రాజధాని అమరావతి నిర్మాణంపై రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చను చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయాణ మాట్లాడుతూ వర్షాలు, వరదలు వస్తే  అమరావతి ప్రాంతంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడారు. పైగా రాజధాని నిర్మాణంపై ప్రభత్వంలో చర్చ కూడా జరుగుతోందంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడేందుకు  పచ్చ బ్యాచ్ కు మంచి ఆయుధం దొరికినట్లైంది.

రాజధాని అమరావతిని దొనకొండకు మారిస్తే ఒప్పుకోమంటూ పచ్చ బ్యాచ్ తో పాటు పచ్చ కమలం బ్యాచ్, ఎల్లోమీడియా ఏ స్ధాయిలో జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారో అందరూ చూస్తున్నదే. అసలు రాజధానిని మారుస్తారని ఎవరూ చెప్పలేదు. బొత్సా కూడా ఆ విషయాన్ని ఎక్కడా మాట్లాడలేదు. కానీ మంత్రి మాట్లాడిన మాటలు అదే అర్ధాన్ని ఇచ్చాయి. దాంతోనే రచ్చ షురూ అయ్యింది.

నిజానికి రాజధాని నిర్మాణమైనా, రాజధాని మార్పు విషయమైనా మంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు. ముఖ్యమంత్రిగా జగన్ మాట్లాడితేనే దానికి విలువుంటుంది. కానీ ఈ విషయాలేవీ పచ్చబ్యాచ్ కు ఎల్లోమీడియాకు అవసరం లేదు. జగన్ ను ఎలా గబ్బు పట్టిద్దామా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకు బొత్సా మాటలు మంచి ఆయుధం లాగ దొరికింది. అందుకే ప్రతీ ఒక్కళ్ళూ జగన్నే టార్గెట్ చేసేస్తున్నారు.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నోటికేదొస్తే అది మాట్లాడేయొచ్చని మంత్రులు అనుకుంటే ఇబ్బందులు తప్పవు. పైగా రాజధాని వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇటువంటి విషయాలు జగన్ కు వదిలేస్తే ఇంకా మంచింది. ఏదో కొత్తగా మంత్రైన వాళ్ళు మాట్లాడారంటే అర్ధముంది. బొత్సా లాంటి సీనియర్ మంత్రి కూడా అనవసరంగా తేనెతుట్టెను కదిపితే ఎలాగ ? చూడబోతే మంత్రులకు జగన్ పూర్తి స్వేచ్చ ఇచ్చేసినట్లున్నారు.