ఏపీకి మూడు రాజధానులను ప్రకటిస్తూ అధికార వైసీపీ బిల్లుని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనికి శాసన మండలి చైర్మన్ షరీఫ్ రూపంలో గట్టి ఎదరుదెబ్బ తగిలింగి. పరిపాలన వికేంద్రీకరణ, సి ఆర్డీఏ ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి చైర్మన్ షరీఫ్ పంపడంతో శాశన మండలిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. దీంతో మండలిలోని టీడీపీ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. రాజధాని రైతులకోసం దేవుడే చైర్మన్ షరీఫ్ రూపంలో వచ్చాడని ఈ సందర్బంగా టిడిపి ఎం ఎల్ సి బుద్దా వెంకన్న అభివర్ణించారు. అధికార సభ్యులు, మంత్రులు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా కూడా అవేవి ఖాతరు చేయకుండా షరీఫ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అభినందించారు. ఈ సందర్బంగా టిడిపి కార్యకర్తలు, అమరావతి రైతులు షరీఫ్ కు పాలాభిషేకం చేశారు.
ఒక దశలో చైర్మన్ ను మంత్రులు కూడా దూషించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ కు , వైసిపికి కౌంట్ డౌన్ మొదలైందని, జగన్ బూట్లు నాకే మంత్రులకు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని అయన అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు ఈ రోజు ప్రజలకోసం, రాష్ట్రం కోసం శాశనమండలి గ్యాలరీలో కూర్చోవడం గొప్ప విషయం అని, ఆయనతో పాటు 22 మంది మంత్రులు కూడా కౌన్సిల్ కు వచ్చిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? అని బుద్దా ప్రశ్నించారు. రాష్ట్ర పరిపాలన మొత్తం అమరావతిలోనే జరుగుతుందని అయన ధీమా వ్యక్తం చేసారు.
విజయ్ సాయి రెడ్డి, సుబ్బారెడ్డి మండలి గ్యాలరీ లోకి వచ్చి బెదిరించే ప్రయత్నం చేసారని, ఎమ్మెల్సీ లను ప్రలోభాలకు గురి చేసారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుంటే జగన్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.