సాధారణ ఎన్నికల్లో చతికిల పడ్డ జనసేన పార్టీ ఇప్పుడు ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లోనైనా ఖాతా తెరవాలని ఉవ్విలూరుతోంది. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం అధికార పార్టీ ఆగడాలు మితీమీరిపోతున్నాయంటూ.. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చూస్తుంటే.. ఆయన ప్రచారానికి తెరతీశారని స్పష్టమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నది విధితమే. అయితే తాజాగా జనసేన అధినేత కూడా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నామినేషన్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బెదిరింపులు, దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో హృదయాలను గెలవలేరని హితవు పలికారు. నామినేషన్లు వేసిన వాళ్లంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిస్తూ..
దెబ్బలు తిన్నా … బలంగా నిలబడాలని.. ప్రతి జనసేన, బీజేపీ అభ్యర్థి.. ధైర్యంగా ఉండి.. బెదిరింపులకు లొంగొద్దని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పవన్ కోరారు. 151 మంది సభ్యులున్న వైసీపీకి భయమెందుకు అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోందని పవన్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవం అనిపించేందుకు.. భయపెట్టి గెలిగినా ఆ గెలుపు నిజమైన గెలుపు కాదని పవన్ పలికారు.