బ్రేకింగ్ న్యూస్ : కోడెల ఆత్మహత్య

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయారు. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే కోడెల మధ్యాహ్నం ఉరేసుకున్నారు.  కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కోడెలను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. గడచిన మూడు నెలలుగా కోడెలతో పాటు కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మిపై అనేక కేసులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

కొడుకు, కూతురు గడచిన ఐదేళ్ళుగా చేసిన అరాచకాలకు, దందాలపై ఇద్దరిపైన సుమారు 20 కేసులు నమోదయ్యాయి. కోడెల మద్దతుతోనే సంతానం అరాచకాలకు పాల్పడ్డారు. అదే సమయంలో  మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కోడెలపైన కూడా కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన సొంతానికి వాడుకోవటమే కాకుండా కొడుకుకు సంబంధించిన టూ వీలర్ షో రూములో వాడుకున్నారు. ఆ విషయాలన్నీ సాక్ష్యాధారాలతో సహా బయటపడింది.

ఎప్పుడైతే అసెంబ్లీ ఫర్నీచర్ దుర్వినియోగం చేశారని సాక్ష్యాధారాలతో సహా బయటపడటంతో అరెస్టు తప్పదనే అనుకున్నారు. ఆ సమయంలోనే గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. అరెస్టు నుండి తప్పించుకునేందుకు కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ కూడా నడుస్తోంది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా తన ఇంట్లో కోడెల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవటం అనుమానంగా మారింది.

ఎందుకంటే కోడెల చాలా గుండె నిబ్బరం ఉన్న నేత. ఎంతటి ఆటుపోట్లను కూడా తట్టుకుని నిలబడిన వ్యక్తి. 1983లో ఎన్డీయార్ పెట్టిన టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసిన కోడెల 6 సార్లు ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తానికి కోడెల మృతి అనేక అనుమానాలకు దారితీస్తోంది.