బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి ‘ఆత్మగౌరవ’ నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు స్థాపించిన బలమైన పునాదుల వ్యవస్థ.. అతి స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చింది. దేశమంతా కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో.. జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీకి ప్రతిపక్షంగా నిలిచింది. 38 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలిచింది. మరో రెండేళ్లలో నాలుగు దశాబ్దాల వేడుకకు చేరువవుతున్న తరుణంలో.. ఇప్పుడు తెలుగు దేశం పునాదులు ప్రశ్నార్థకం కావడం, అధినేత నాయకత్వంపైనే విశ్వాసం సన్నగిల్లడం ఆందోళన కరంగా ఉంది.

ఆటు పోట్లు టీడీపీకి గానీ, చంద్రబాబుకు గానీ కొత్తేమీ కాదు.. పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారీ అంతే వేగంగా లేచి నిలబడింది. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్దం. చంద్రబాబు స్వయంకృతాపరాధం. తెలంగాణ పోరాటంలో రెండు కళ్ల సిద్ధాంతంగా మొదలై .. ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం స్థాపించబడిందో ఆ స్ఫూర్తికే విరుద్దంగా.. తీసుకున్న నిర్ణయాలు అన్నీ వెరసి పార్టీ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.

నాయకత్వ లోపాలు, 2014 విజయం అనంతరం నారా లోకేష్‌ వ్యవహార శైలి పార్టీ నాయకత్వంపై గౌరవాన్ని తగ్గించేలా చేశాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆ లోపాలన్నీ 2019 పార్టీ ఓటమితో ఒక్కసారిగా బైట పడ్డాయి. తొలినాటి నుండి పార్టీతో ఉన్న వారే పక్కదారులు పట్టేలా చేసింది. పార్టీలో యువత ప్రాతినిథ్యం తక్కువైంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేత ఇప్పుడు కేవలం ఓ ప్రాంతానికి, ఓ నగరానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నో చేసే అవకాశాలు ఉన్నా చంద్రబాబు దూర దృష్టి ఇప్పుడు ఏమైందో గానీ.. ఏ ఒక్క అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోలేక పోగా.. వివాదాస్పద నిర్ణయాలతో మరింత ప్రతిష్టను కోల్పోయి అవమానాలను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు దూరమయ్యారు.

విపత్తుల సమయంలో చంద్రబాబు వ్యూహాలు వాహ్ అన్న వారే.. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తుంటే.. బాబు ఎక్కడో ఇంటికే పరిమితం అవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబే కాదు.. ఆ పార్టీలో నేతలు కూడా స్తబ్దుగా అయిపోయారు. ఇదే స్థితి కొనసాగితే తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఏ స్థితిలోకి జారిపోయిందో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పునరావృతం అవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడం, యువతకు పట్టం కట్టడం, అలాగే లోకేష్‌ తప్పిదాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కనబడుతుంది.