బీజేపీ పేరెత్తే ధైర్యం వైసీపీ లీడర్లకు లేకుండా పోయిందే

పార్క్ హయాత్ హోటల్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావులతో రహస్య సమావేశం నిర్వహించారని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలకి దిగుతోంది.  విజయసాయిరెడ్డి, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మీడియా ముందుకొచ్చి ఇది నీచ రాజకీయం, రహస్య మీటింగ్ వెనక సూత్రధారి చంద్రబాబే, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ గగ్గోలు పెడుతున్నారు.  ఇంతలా మాట్లాడుతున్న వీరంతా నిమ్మగడ్డ కలిసిన నేతలు భారతీయ జనతా పార్టీలో కీలక నేతలని మాత్రం మాట్లాడట్లేదు.  
 
ఎంతసేపూ సుజనా చౌదరి, కామినేనిలు చంద్రబాబుకు సన్నిహితులని అంటున్నారు తప్ప భాజపా నాయకులతో నిమ్మగడ్డకు ఏం పని అంటూ ప్రశ్నించిన వైసీపీ లీడర్ ఒక్కరూ లేరు.  సుజనా చౌదరి టీడీపీ నుండి భాజపాలోకి తన లబ్ది కోసమే మారారు.  కొన్ని కారణాల రీత్యా బీజేపీ అధిష్టానాన్ని కాదని ఆయన ఏ పనీ చేయరు.  ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన నిమ్మగడ్డ అంశంలో తెర వెనుక రాజకీయాలు చేయాలని అనుకుంటే ఆయన్ను నడిపించే శక్తి ఖచ్చితంగా భాజపానే అయ్యుంటుంది.  ఏపీ వ్యవహారాల్లో స్పష్టమైన స్టాండ్ అంటూ ప్రదర్శించని కమల దళం ఎలాంటి వ్యూహం పన్నుతుందో చెప్పడం కష్టం.  
 
ఇదే పరిస్థితి వైసీపీది.  పూర్తి అనుకూలంగా, పూర్తి వ్యతిరేకంగా లేని కేంద్ర ప్రభుత్వం మీద ఎలా రియాక్ట్ కావాలో వారికి బొత్తిగా పాలుపోవడం లేదు.  ఒకవేళ నోరుజారి విమర్శలకు దిగితే ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందోననే కంగారు అధికార పక్షానికి లేదంటే అది అబద్దమే అవుతుంది.  అందుకే వైసీపీ నేతలు నిమ్మగడ్డతో రహస్య మీటింగ్ నిర్వహించి భాజపా నేతలని అనలేకపోతున్నారు.  టీడీపీ డిమాండ్ చేసినట్టు భాజపాను వివరణ అగడలేకపోతున్నారు.  ఇక టీడీపీ నేతలైతే అసలు నిమ్మగడ్డ కలిసింది బీజేపీ నాయకులను అయితే వైసీపీ తమ మీద ఎందుకు విమర్శలకు దిగుతుందో అర్థం కావట్లేదని, ఏమున్నా బీజేపీతో తేల్చుకోవాలని లాజిక్ లాగుతున్నారు.  
 
సుజనా చౌదరి వివరణ ఇస్తూ ఒకేరోజు కామినేనిని, నిమ్మగడ్డను కలిసిన మాట వాస్తవమే కానీ విడివిడిగా కలిశానని, నిమ్మగడ్డతో కుటుంబ విషయాలే మాట్లాడాను కానీ ఎలాంటి రాజకీయపరమైన చర్చలు చేయలేదని అన్నారు.  అయినా ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కలిసే స్వేచ్చ తనకుందని గట్టిగా జవాబిచ్చారు.  మరి వీటన్నింటికీ వైసీపీ వద్ద ఆన్సర్ లేదు.  ఎవరినైనా ఇరుకున పెట్టగలననే ధీమాతో ట్వీట్లు వేసే విజయసాయిగారు కూడా ఈరోజు ట్వీట్లలో సుజనా చౌదరి, కామినేని అంటూ వ్యక్తుల పేర్లు ప్రస్తావకు తెచ్చారు కానీ వారు భాజపా నేతలు కదా మీటింగ్ వారికి తెలియకుండానే జరిగిందా అని మాత్రం అడగలేకపోయారు.  
 
ఇక టీడీపీ పేరు చెబుతూ మీటింగ్ వెనక సూత్రధారి చంద్రబాబు ఉన్నారని నానా యాగీ చేస్తూ వారిని ఇరుకున పెట్టాలనే వైసీపీ ప్రయత్నంతో వారికి ఎలాంటి రాజకీయ లబ్ది చేకూరదనేది కూడా వాస్తవం.  టీడీపీ లీడర్లు ఎంత విమర్శ ఎదురైనా ఈ వివాదానికి సమాధానం చెప్పరు.  నేరుగా నిమ్మగడ్డను ప్రశ్నిస్తే సుజనా చౌదరి చెప్పిన సమాధానమే వస్తుంది కానీ వేరొకటి రాదు.  సో ఈ వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ ఎంత రచ్చ చేసినా ఎవరు ఎన్ని ఎత్తులు పైఎత్తులు వేసినా తీర్పంటూ చెప్పాల్సింది న్యాయస్థానమే.