బిజెపి నేతలు రాజధాని రైతులను ఎన్నాళ్లు మోసంచేస్తారు?

BJP Flag

విజయమో వీర స్వర్గమో అన్నట్లు అమరావతి రాజధాని రైతులు 75 రోజులుగా వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నారు. వారి పోరాటంలో ఎంతవరకు న్యాయబద్దత వుందో అవతల పెడితే అధికార వైసిపి తప్ప రాష్ట్రంలో అన్ని పార్టీలు రైతులకు మద్దతు ఇస్తున్నాయి . ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతి పాదన విరమించుకొనే అవకాశాలు ఏమాత్రం లేవని తేలిపోయింది. ఇక రాజధాని రైతులకు రెండే రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి. న్యాయ స్థానాలు. రెండు కేంద్రంలో వున్న బిజెపి. న్యాయ స్థానాల అండ కూడా పరిమితమే.

కేంద్రంలో వున్న బిజెపి దొంగాట ఆడుతోంది. కర్ర విరగకుండా పాము చావకుండా మోసపూరిత వైఖరి అవలభించుతోంది. రాజధాని రైతులను సస్పెన్స్ లో వుంచుతోంది రెండు రోజుల క్రితం ఢిల్లీ నుండి బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు వచ్చారు. పైగా గవర్నర్ ను ఎందుకు కలిశారో తెలియదు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల వలన శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయని ఒక ప్రకటన పడేశారు. అదే విధంగా రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనిదని స్పష్టం చేశారు. పైగా గతంలో టిడిపి పాలనపై నిప్పులు చెరిగారు.

ఒక వేళ జాతీయ రాష్ట్ర బిజెపి పార్టీ విధానం ఇదే అయితే ఎవరూ తప్పు పట్ట పని లేదు. కాని నరసింహారావు వెళ్లిన మరు రోజు ఆదివారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తుళ్ళూరులో నిరాహార దీక్ష సాగిస్తున్న మహిళా శిబిరం సందర్శించారు. రాజధాని రైతులు సాగిస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు అంతటితో ఆగకుండా గత తెలుగుదేశం పాలన కన్నా నేడు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రస్తుతం ఎవరు నోరెత్తినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని తీవ్ర మైన ఆరోపణలు చేశారు.జాతీయ అధికార ప్రతినిధి నర్సింహారావు ప్రకటనలకు ఆదివారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగాలకు సంబంధమే లేదు.పైగా ఢిల్లీ నుండి విజిటింగ్ ఫ్రొఫెసర్ గా వచ్చి వెళ్తున్న నరసింహారావు ఎప్పుడూ రాజధాని రైతుల శిబిరాల వద్దకు వచ్చి వెళ్లింది లేదు. కాని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పలు దఫాలు రైతుల వద్దకు వచ్చి వెళ్లారు. ఆదివారమూ వచ్చారు.
వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నా అది నైతిక మద్దతుగానే భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో వుండే బిజెపి ఏదో సాయం చేస్తుందనే భావనతోనే రైతులు ఉద్యమం సాగిస్తున్నారు.

కాని కుక్కను చంపాలంటే పిచ్చిదని పేరు పెట్టాలి కాబట్టి వారి పోరాటానికి టిడిపి ముద్ర వేసి అధికార పార్టీ తప్పించుకొంటోంది. వాస్తవం గ్రహించాలంటే శనివారం విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీరు చూస్తే వారి పోరాటానికి ఎంతటి రాజకీయ మద్దతు వుందో అర్థమౌతుంది.కాని మోసమంతా బిజెపిలో వుంది. ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు నరసింహారావు లాగా తాము చేయ గలిగిందేమీ లేదని రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని ప్రకటించి చేతులు దులుపుకొంటే అతి కొద్ది రోజుల్లోనే రైతుల హడావుడి చల్లారిపోతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ వుంది. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అంశంలో కేంద్ర బిజెపి నేతల వద్ద మాట తీసుకుని వారితో పొత్తు పెట్టుకొన్నానని చేసిన ప్రకటన కూడా ఉద్యమానికి కొంత జీవం పోసింది. ఇప్పుడు అందరూ కలసి మోసం చేస్తున్నారు.

ఎప్పుడు పోలీసు లాఠీ దెబ్బలు ఎరుగని గ్రామీణ మహిళలు పోలీసు జులుం ఏలా వుంటుందో చవి చూస్తున్నారు. శాసన సభ ముట్టడి రోజు మహిళలు పొలాల వెంబడి గుంట మిట్టల్లో పడుతూ లేస్తూ తీసిన పరుగులు టివిల్లో చూచినప్పుడే ఈ ఉద్యమం పెయిడ్ ఆర్టిస్థులదని ఆరోపించిన ప్రకటనల్లోని డొల్ల తనం వెల్లడైంది. . ఇప్పటికైనా జాతీయ రాష్ట్ర బిజెపి నాయకత్వాలు మోసపూరిత వైఖరులు కట్టి పెట్టి రాజధాని రైతులకు వాస్తవం చెబితే ఉద్యమం నడుపుతున్న మహిళలకు మేలు చేసిన వారౌతారు