బరిలోకి దిగిన చంద్రబాబు..!

Chandra Babu Naidu

మూడు రాజధానుల ప్రకటన మొదలు రెండున్నర నెలలకుపైగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రాజకీయం అంతా అమరావతి చుట్టే పరిభ్రమిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా.. సరే ఆయన మాటల్లో అమరావతి ప్రస్తావన తప్పనిసరి అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలోనైనా అధినేత శ్రేణులను సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టకపోవడంపై తెలుగు తమ్ముళ్లలో ఓ వైపు ఆందోళన నెలకొని ఉంటే మరో వైపు బీసీ రిజర్వేషన్ల‌పై హైకోర్టు తీర్పు కూడా చంద్రబాబు తప్పిదమే అంటూ పాలక పక్షం మరో కొత్త అస్త్రాన్ని అందుకుంది.

స్థానిక ఎన్నికల్లో తమ గెలుపు ఏక పక్షమే అని ఇప్పటికే అధికార పక్ష నేతలు ఆనంద పడుతున్నారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ ఇక నామమాత్రమే అని, వైసీపీ శ్రేణుల ప్రచార హోరులో తాము నిలబడలేమోమో అన్న అంచనాలకూ తెలుగు తమ్ముళ్లు వస్తున్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏ అవినీతి పేరు చెప్పి జగన్‌ను ఓడించాలని చంద్రబాబు చూశారో అదే అవినీతి పేరుతో ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నేతను ముప్పతిప్పలు పెట్టాలను చూస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ అధికారంలోకి వచ్చిందే మొదలు ప్రచారంతో దూసుకుపోతున్నారు.

సరిగ్గా ఇక్కడే చంద్రబాబు మేల్కొన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్తూ వచ్చిన ఆయన దాన్ని నిరూపించేందుకు స్థానిక ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. రిజర్వేషన్లపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశ మయ్యారు.

జగన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని చూపించాలంటే స్థానిక ఎన్నికల్లో టీడీపీ స్థానాలు గెలుచుకోక తప్పనిసరి పరిస్థితిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుండి కోలుకుని తెలుగు తమ్ముళ్లలో తిరిగి ఉత్సాహం నింపేందుకు శాయశక్తులా ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలని ఆయన చూస్తున్నారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహాలు స్థానిక ఎన్నికల్లో పనిచేస్తాయా.. ఇప్పటికే విజయం ఏక పక్షం అంటోన్న అధికార పక్ష ధీమానే నిజమవుతుందా అన్నది చూడాలి.