బద్ధ శతృవులను కలిపిన జగన్

వారిద్దరు బద్ధ శతృవులు. సంవత్సరాలుగా ఇద్దరు చెరో పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. అలాంటి ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి ఏకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నేతలైన పిల్లి సుభాష్ చంద్రబోస్,  మాజీ ఎంఎల్ఏ  తోట త్రిమూర్తులు ఏకమయ్యారు. తెలుగుదేశంపార్టీకి తోట రాజీనామా చేసి తన మద్దతుదారులతో వైసిపిలో చేరారు.

నిజానికి తోటను వైసిపిలోకి చేర్చుకునేందుకు మంత్రి, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే పిల్లి నైజానికి తోట నైజం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పిల్లేమో లో ప్రోఫైల్ మెయినటైన్ చేస్తారు. అదే తోట ఏమో పూర్తిగా డామినేటింగ్ నేచర్. అదే సందర్భంలో తోట పై పెద్ద ఎత్తున రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి ఇద్దరి మధ్య ఏమీ వేయకపోయినా భగ్గుమంటుంది.

అలాంటి తోటను పార్టీలోకి చేర్చుకోవటానికి పిల్లి సుతారమూ ఇష్టపడలేదు. అయితే పార్టీలో పై స్ధాయిలోని కీలక వ్యక్తుల ద్వారా తోట తన మంత్రాంగాన్ని నడిపించారట. ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన చీరాల మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ ద్వారా రాయబారం పంపి సక్సెస్ అయ్యారని సమాచారం. దాంతో పిల్లిని జగన్ ప్రత్యేకంగా పిలిపించి తోట చేరిక వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవని నచ్చ చెప్పారట. దాంతో పిల్లి కూడా ఏమీ మాట్లాడలేకపోయారని సమాచారం.

నిజానికి తోటను పార్టీలో చేర్చుకోవటం వల్ల వైసిపికి కొత్తగా వచ్చే ఉపయోగం ఏమీ లేదనే చెప్పాలి. కానీ తనంతట తానుగా వస్తానని అన్నపుడు చేర్చుకోక జగన్ కు తప్పలేదట. ఎందుకంటే రామచంద్రాపురం నియోజకవర్గం వరకూ తోటకు గట్టి పట్టున్నట్లే చెప్పుకోవాలి. అదే సమయంలో బలమైన కాపు సామాజికవర్గంకు చెందిన నేత కూడా. దాంతో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తోట రాకను జగన్ కూడా స్వాగతించినట్లు తెలుస్తోంది. మరి చూడాలి తోట చేరిక వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందో