ఆంధ్రపదేశ్ ‘బంద్’ సెగ కేంద్రానికి తాకుతుందా.?

AP-Bandh

 

AP-Bandh
AP-Bandh

‘బంద్’ అనేది ప్రజాస్వామ్యంలో ఓ నిరసన రూపం. అయితే, ఆ ‘బంద్’ అనేదానికి ఇటీవలి కాలంలో అర్థాలు మారిపోయాయి. రాజకీయ పార్టీలు తమ సొంత అవసరాల కోసం ‘బంద్’లు చేయడం మొదలు పెట్టాక, అధికారంలో వున్నవాళ్లు ఆ ‘బంద్’లను పట్టించుకోవడం మానేయడం చూస్తున్నాం. మామూలుగా అయితే అధికారంలో వున్నోళ్ళు ఈ ‘బంద్’లను వ్యతిరేకిస్తుంటారు. కానీ, ఈ మధ్య ‘బంద్’ అనగానే ఒక్కోసారి అధికార పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి.. ప్రభుత్వాలూ సంఘీభావం తెలుపుతున్నాయి. రాజకీయ అవసరాలు అలాంటివి.

అధికార పార్టీ కూడా సహకరించాక, ఆ ‘బంద్’ విజయవంతం కాకుండా ఎలా వుంటుంది.? కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ‘బంద్’ జరిగితే అధికారంలో వున్న పార్టీలు సహకరించాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయమై ఏపీలో ‘బంద్’ జరుగుతోంటే, అధికార వైసీపీ మద్దతిచ్చింది. వ్యవసాయ చట్టాల కథ వేరు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కథ వేరు. అయినా, రాష్ట్రంలో బంద్ జరిగితే, కేంద్రమెలా దిగొస్తుంది.? ఆంధ్రపదేశ్ ఆర్థిక పరిస్థితి అస్సలేమీ బాగాలేదు. ఈ తరుణంలో ‘బంద్’ వల్ల నష్టపోయేది ఆంధ్రపదేశ్ మాత్రమే. ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనుండడం కొంత ఊరట. అయితే, ఈ బంద్ సమయంలో కోల్పోయిన నష్టం ఎలా పూడ్చగలం.? రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి బంద్‌లు చేయొద్దని అధికార పార్టీ పిలుపునిచ్చి వుంటే బావుండేదేమోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగాల్సింది ఢిల్లీలోనే తప్ప గల్లీలో కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలూ తమ సొంత పబ్లిసిటీ కోసమే ఉద్యమిస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. కాగా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు గతంలో ప్రకటించిన బీజేపీ, జనసేన.. తాజా బంద్‌లో పాల్గనకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.