బందరు పోర్టుకు లైన్ క్లియర్..నవయుగకు షాక్

బందరు పోర్టు నిర్మాణానికి కొత్తగా టెండర్లు ఆహ్వానించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. నవయుగ కంపెనీకి ఇచ్చిన బందరు పోర్టు కాంట్రాక్టును జగన్ రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో నవయుగ కంపెనీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది.

అయితే రెండు వైపులా వాదనలు విన్న తర్వాత కోర్టు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. అసలు టెండర్లు పిలవకుండా ప్రభుత్వాన్ని నిలుపుదల చేయాలన్న కంపెనీ వాదనను కోర్టు కొట్టేసింది. పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలుచుకోవచ్చని కోర్టు ప్రభుత్వానికి అనుమతిచ్చింది. అయితే ఈనెల 25వ తేదీలోగా టెండర్లను తెరవద్దని మాత్రం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంటే నవయుగ వాదనతో పాటు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా వాదన వీగిపోయినట్లైంది. విచిత్రమేమిటంటే దాదాపు దశాబ్దకాలం క్రితమే ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణాన్ని నవయుగ కంపెనీకి అప్పగించినా పనిమాత్రం మొదలుకాలేదు. భూ సేకరణ సమస్య కొలిక్కి రాలేదు కాబట్టి పనులు మొదలుపెట్టలేదని కంపెనీ ఇపుడు చెబుతోంది.

మరి ఇన్ని సంవత్సరాలు భూ సేకరణకు ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి పెట్టలేదన్న ప్రశ్నకు కంపెనీ సమాధానం చెప్పటం లేదు. అందుకనే జగన్ ప్రభుత్వం పోర్టు నిర్మాణ కాంట్రాక్టును రద్దు చేసేసింది. ముందు పోలవరం ప్రాజెక్టు, తర్వాత విద్యుత్ పిపిఏలు తాజాగా బందరు పోర్టు టెండర్ కాంట్రాక్టు రద్దు వ్యవహారం ప్రభుత్వానికి అనుకూలంగా రావటం మంచిదే కదా ?