కరోనా నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి గ్రీన్‌జోన్‌లలో మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్రీన్‌జోన్‌లలో పరిశ్రమలు ప్రారంభించేందుకు సైతం అనుమతులు ఇచ్చింది. అయితే ప్రజా రవాణాకు మాత్రం ఇప్పట్లో అవకాశమే లేదని స్పష్టం చేసింది. దీంతో మే తర్వాత కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఎక్కడ చిక్కుకున్న వారు అక్కడే ఉండాల్సి రావచ్చు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు రెండో ఫేజ్ బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. తెలంగాణ, మహారాష్ట్ర, దిల్లీలో లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు అవుతున్నాయని పేర్కొంది.
గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను సైతం స్వస్థలాలకు పంపిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే గుజరాత్ నుంచి 54 బస్సుల్లో బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయల్దేరారు. అలాగే రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సహకరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
పేదలకు పంపిణీ పంపిణీ చేసేందుకు కేంద్రం ఇస్తోన్న పప్పు ధాన్యాలను చాలా రాష్ట్రాలు తీసుకెళ్లలేదని, వాటిని తీసుకెళ్లి పేదలను అందజేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ఇక రానున్న రోజుల్లో పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ సడలింపులు మరిన్ని ఇచ్చేవిగా కనిపిస్తున్నా ప్రజా రవాణా వంటి వాటిని మాత్రం ఇప్పట్లో ప్రారంభించేలా కనిపించడలేదు. దీంతో వలస కూలీలు సహా, సామాన్య జనం అంతా చాలా ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.