ప్చ్.. సామాన్యుడి బాధ వర్ణాతీతం ! 

 
మన దేశంలో కరోనా పంజా విసురుతుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండిపడింది. అయితే కరోనా కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా స్పెషల్ ట్యాక్స్ లు విధిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అసలుకే దేశంలో లాక్ డౌన్ కారణంగా చాలామంది తమ ఉద్యోగులు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ స్పెషల్ ట్యాక్స్ గోల ఏమిటి ?  అనేకమంది ఉపాధిలేక అవస్థలు పడుతున్నా..  వ్యాపారాలు దెబ్బతిన్నా..  ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు.
 
 
పైగా  తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఉద్యోగుల జీతాల్లో సగానికి కోతపెట్టింది.  మూడునెలలుగా సగం జీతంతో ఉద్యోగులు పడుతున్న కష్టాలు వారికే తెలుసు. మరోవైపు మూడునెలల కరెంటు బిల్లు ఒకేసారి స్లాబులు మార్చి ఇవ్వడంతో వేలల్లో బిల్లు రావడంతో పేద ప్రజలు లబోదిబోమంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.  మద్యం రేట్లను 15 శాతం వరకు పెంచి మద్యం ప్రియులను జేబులను కొల్లగొడుతోంది. సరే పోనీ ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారా అంటే..  తెలంగాణలో కరోనా టెస్టుల పై పకడ్బంధీ చర్యలు చేపట్టని దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. దానికి తోడు  ఈ ప్రభుత్వాలు వలస కార్మికులను ఏమాత్రం పట్టించుకున్నాయో  తెలిసిందే. 
 
 
ఇక మధ్యలో కామెడీ ఏమిటంటే  కేంద్రం 20లక్షల స్పెషల్ ప్యాకెజీనీ ప్రకటించింది. ఆ ప్యాకేజీ వల్ల సామాన్యుడికి ఒరిగేందేమీలేదు. ఇప్పుడు  కేంద్రం గత 11రోజులుగా పెట్రోలు ధరలను పెంచుతుండటం పై సామాన్యులు  ఆందోళన వ్యక్తం చెయ్యక తప్పట్లేదు.  తాజాగా పెంచిన ధరలతో తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర రూ.80.22లకు చేరగా డీజిల్ రూ.74.07గా చేరింది. ఇక ఏపీలో పెట్రోల్ ధర రూ.80.66కు చేరితే.. డీజిల్ రూ.74.54గా మారింది. ప్రభుత్వాలు  ఆదాయం పెంచుకోవడం కోసం  ఇలా ప్రజలను దోచుకోవడం తీవ్ర అన్యాయమే.  ఈ మొత్తం వ్యవహారంలో సామాన్యుడి బాధ వర్ణాతీతం.