కరోనా వలయంలో ప్రపంచం అల్లాడిపోతోంది. ఇక ఇండియాలో కూడా కరోనా దెబ్బకు మూడునెలలు నిరవధికంగా లాక్ డౌన్ ను పెట్టారు. ఆ లాక్ డౌన్ కరోనా నడ్డి ఎంతవరకు విరిచిందో గాని, పేద మధ్య తరగతి వర్గాల నడ్డిని మాత్రం విరిచింది. చిరు వ్యాపారులు ఆదాయం కోల్పోగా, ప్రైవేట్ ఉద్యోగుల జీతాలలో కోతపడి.. కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. సరేలే అని సరిపెట్టుకుంటే కొందరు ఏకంగా ఉద్యోగాలనే కోల్పోయారంటే.. ప్రస్తుత గడ్డు కాలాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక రోజువారి కూలీల బాధలు ఎంత చెప్పినా తక్కువే.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పియిన శ్రామిక జనానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుతూ పేదవాడి పై పెనుభారం మోపింది. మరి నిరవధికంగా మోదీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్న క్రమంలో…దీని పై బీజేపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటనేది ఆయనను విమర్శిస్తున్న వారి ప్రశ్న. పెట్రోల్ ధరల పెరుగుదల గురించి ఆయన మోడీని ప్రశ్నించరా అనేది సామాన్యుడి ఆవేదన. అన్యాయాన్ని ప్రశ్నిస్తా అని వచ్చిన పవన్ మోదీ ఏం చేసినా సపోర్ట్ చేస్తాడా ?
బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం కావొచ్చు, కానీ పేదవాడి పై ఆర్ధిక భారం విషయంలో జవాబుదారిగా కూడా ఉండాలి. అడ్డగోలుగా పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి మాట్లాడాల్సిన బాధ్యత, ఎవరైనా అడిగితే జవాబు చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఉంది. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై స్పందిచే పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన కూడా తన స్టాండ్ ఏమిటో తెలియజేయాలి. పేదవాడి బాధను తన గొంతుకతో పవన్ చాటి చెప్పాలి.