కరోనా విస్తృతిని ఎలా అడ్డుకోవాలి ? అసలు వైరస్ ఎందుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది ? లాంటి వ్యాఖ్యల చుట్టే గత కొన్నినెలలుగా ప్రపంచం ఆలోచిస్తోంది. వాస్తవ పరిస్థితిని నిర్మోహమాటంగా విశ్లేషిస్తే.. కరోనా కేవలం మానవ తప్పిదమే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి మాట్లాడుకుంటే.. మర్కజ్ వెళ్లి వచ్చి వారి వల్ల…ప్రస్తుతం వలస కూలీల రూపంలో మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోందనేది కాదనగలమా ? అందుకే తెలంగాణలో వైరస్ వ్యాప్తి జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో రోజురోజుకు వైరస్ పెరుగుతూనే ఉంది.
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు, ఇతరులు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉంటున్న కారణంగా.. వారి పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌లో ఉంచాలి. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు వివిధ మార్గాల్లో 41,805 మంది వచ్చారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
మరి వారి అందరికి పరీక్షలు చేశారా అంటే ? దాదాపుగా చేశారు అని చెబుతున్నారు. ఆ దాదాపు అనేది ఎంతవరకో ఎవరికీ తెలియదు. పైగా సడలింపులతో ఎక్కువ మంది బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించడం లేదు. వైన్ షాప్స్ వద్ద భౌతికదూరం పాటించట్లేదు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వైరస్ వ్యాప్తి చెందితే ఆ భయాందోళనల గురించి ఊహించగలమా ? కాబట్టి త్వరగా ప్రభుత్వం వలసలు వస్తున్నవారితో పాటు మాస్క్ లు, భౌతికదూరం పాటించని వారి పై ప్రత్యేక దృష్టి సారించాలి. మరి కేసీఆర్ ఏమి చేయబోతుండో జర సూద్దాం.