ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన సమస్యలు ప్రజల దృష్టి నుండి పక్కనపడిపోయాయి. కారణం జల జగడం. సంగమేశ్వరం నుండి శ్రీశైలం కుడి కాలువకు రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకోవడానికి కొత్త ప్రాజెక్ట్ కట్టాలని ఏపీ సర్కార్ జీవో నెంబర్ 203ను విడుదల చేసింది. దీంతో కేసీఆర్ శ్రీశైలం నీటిని రాష్ట్ర విభజన నిభంధనలకు వ్యతిరేకంగా తీసుకుని తెలంగాణకు అన్యాయం చేస్తారా.. దీనిపై న్యాయ పోరాటానికి దిగుతాం అంటూ తేల్చి చెప్పారు. ఇక వైఎస్ జగన్ అయితే నిభంధనలకు అనుగుణంగానే ప్రాజెక్ట్ కట్టదల్చామని, దీన్ని ఆపాల్సిన అవసరమే లేదని, తెలంగాణ శ్రీశైలం నీటిలో తన వాటా తీసుకుంంటున్నప్పుడు ఏపీ తీసుకోవడంలో తప్పేమిటని బల్లగుద్ది అడుగుతున్నారు.
ఇలా ఇరు రాష్ట్రాల మధ్య వాదోపవాదనల వాతావరణం నెలకొని ఉంది. ప్రధాన మీడియా సైతం ఈ అంశం మీదే ఎక్కువ దృష్టి పెట్టడంతో గ్యాస్ లీక్ దుర్ఘటన, కరెంట్ బిల్లుల పెంపు, కరోనా వంటి ప్రధానా సమస్యలు మరుగునపడుతున్నాయి. ఇదంతా గమనిస్తే మన వాటా మనం తీసుకోవడం, ప్రాజెక్ట్ కట్టాలనుకోవడం తప్పు కాదు.. కానీ నిధుల కొరత భారీగా ఉన్న ఇలాంటి సమయంలో వేల కోట్లు ఖర్చుపెట్టి కొత్త ప్రాజెక్ట్ ఎలా కడతారనేదే తేలాల్సిన విషయం.
ప్రధానమైన పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనే నిధుల కొరత వెంటాడుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గత ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులే కేంద్రం నుండి ఇంకా పూర్తిగా రాలేదు. వచ్చిన కొద్దిపాటి మొత్తాన్ని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంది. ఇటు చూస్తే లాల్ డౌన్ కారణంగా ఆదాయాలు తగ్గాయి. ఇన్ని సమస్యల నడుమ రాబోయే రోజుల్లో పోలవరం పనులు ఎలా సాగుతాయనే అనుమానం అందరినీ వెంటాడుతోంది. కేంద్రం దయతలిస్తేనే నిధులు సమకూరే పరిస్థితి. అలాంటిది పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కోసం రూ.6000 నుండి రూ.7000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ప్రభుత్వమే చెప్పాలి.