గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశంపార్టీ-వైసిపి మధ్య మొదలైన పోటి శిబిరాలు రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచేస్తోంది. వైసిపి బాధితులతో గుంటూరులో టిడిపి శిభిరం పెట్టింది. దానికి పోటిగా వైసిపి కూడా గురజాలలో టిడిపి బాధితుల శిభిరాన్ని పెట్టింది. చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు బుధవారం గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో పర్యటించబోతున్నారు. అదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు కూడా గురజాల ప్రాంతంలో పర్యటించనున్నారు.
హత్యా రాజకీయాలు మీరు చేస్తున్నారంటే కాదు మీరే చేస్తున్నారంటూ ఒకళ్ళపై మరొకళ్ళు చేసుకుంటున్న ఆరోపణలతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయని, హత్యలు జరిగాయంటూ చంద్రబాబు ఒకటే గగ్గోలు పెట్టేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి పోటిగా వైసిపి కూడా టిడిపి హయాంలో తమ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు, హత్యల జాబితాను బయటకు తెచ్చింది.
వైసిపి హయాంలో టిడిపి నేతలను టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయో లేదో స్పష్టంగా ఎవరూ చెప్పలేరు. అయితే టిడిపి హయాంలో మాత్రం వైసిపి నేతలను టార్గెట్ చేసుకుని దాడులు జరిగింది మాత్రం వాస్తవం. చివరకు వైసిపి ఎంఎల్ఏలపైన కూడా అప్పట్లో కేసులు పెట్టారు. అనంతపురంలో ఓ నేతను, కర్నూలు జిల్లాలో చెఱుకులపాడు నారాయణరెడ్డిని టార్గెట్ చేసి మరీ దారుణంగా హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే.
రాజకీయ దాడులు జరగటం, వైసిపి నేతల హత్యలు జరగటం అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం ఏమీ తెలియనట్లే నాటకాలాడుతున్నారు. గ్రామాల్లో గొడవలు జరగటం లేదని వైసిపి కూడా చెప్పటం లేదు. అయితే జరిగిన గొడవల్లో ఎక్కువ భాగం వ్యక్తిగత గొడవలే అని వైసిపి నేతలంటున్నారు. మరి నిజమో కాదో పోలీసులే చెప్పాలి.