రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది.
40 ఏళ్ల అపార అనుభవం, దేశ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరు.. అంఛనాలు, నమ్మకాలు అన్నీ గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి. అంఛనాలు తలకిందులయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి బైటికి వచ్చి మోడీపైనే యుద్దం ప్రకటించిన ఆయన.. గెలుపై థీమాతో నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టారు. తీవ్ర విమర్శలు చేశారు. మరో అడుగు ముందుకేసి కేంద్రంలో మోడీని, ఓడించేందుకు ఇతర రాష్ట్రాల్లో ప్రచారాలు చేశారు.
కానీ అంతా తారుమారైంది. రాష్ట్రంలో ఆయన ఓడిపోయారు, కేంద్రంలో మోడీ గెలిచారు. ఎక్కడ తప్పిదం జరిగింది అంటూ తర్జనబర్జనలు పడ్డా ఫలితం ఏమీ లేదు. పైగా ఏం మాట్లాడినా, విమర్శించినా తీవ్ర అవమానాలు ఎదురయ్యే స్థితి. దాని నుండి బైట పడేందుకు చంద్రబాబుకు చాలా కాలమే పట్టింది.. ఇంకా పడుతుంది అని అనిపిస్తోంది. అయితే నెమ్మదిగా ఆయన మరోసారి తన ఆలోచనలకు పదును పెడుతున్నారు.
చంద్రబాబు పోగొట్టుకున్నచోటే వెతుక్కునే పని మొదలెట్టినట్లున్నారు. ముందుగా మోడీని దగ్గర చేసుకుని ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు నెరపాలని అనుకుంటున్నారేమో.. గత కొద్ది కాలంగా ఆయన తీరు చూస్తే అలానే కనిపిస్తోంది. మోదీకి, అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం.. ఇప్పుడు తాజాగా కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీకి లేఖ రాయడం చూస్తే బాబు మళ్లీ మోడీకి దగ్గరయ్యే ఆలోచనల్లో ఉన్నట్లున్నారు.
కానీ ఇప్పుడు 80ల నాటి రాజకీయాలు పనిచేసే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. జగన్ ఎంతో వ్యూహాత్మకంగా అటు కేంద్రంతో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. పైగా బాబును ముప్పు తిప్పలు పెట్టిన మోదీ ప్రభుత్వం జగన్‌కు మాత్రం చాలా విషయాల్లో సపోర్టు చేస్తోంది. ముఖ్యంగా పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో. ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి.