పొత్తు కోసం చంద్రబాబు పాట్లు

మళ్ళీ పాత మిత్రులతో పొత్తుకు తెలుగుదేశంపార్టీ రెడీ అవుతోందా ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానం మొదలైంది. ఏదో ఓ పార్టీతో పొత్తులు పెట్టుకోందే ఎన్నికలను ఎదుర్కొనేంత సత్తా చంద్రబాబునాయుడుకు లేదని అర్ధమైపోయింది. చంద్రబాబు చేతికి టిడిపి పగ్గాలు వచ్చిన తర్వాత మొదటిసారిగా మొన్నటి ఎన్నికల్లోనే ఒంటరిగా పోటి చేసింది. దాని ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో అందరు చూసిందే.

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవ్వటంతో చంద్రబాబుకు దిమ్మ తిరిగింది. దాంతో పాతమిత్రలను మంచి చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ రాజ్యసభ సభ్యుల్లో నలుగురిని తానే బిజెపిలోకి ఫిరాయించేట్లు చేశారు. దాంతో బిజెపి ఎంపిలు చెలామణి అవుతున్న ఎంపిలు టిడిపితో పొత్తుకు అక్కడి నేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా లింకులు కదుపుతున్నారు. అందుకనే రాజధాని గ్రామాల్లో పర్యటించిన జనసేన అధినేత జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. విచిత్రమేమిటంటే పవన్ చేసిన ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. దాంతో పవన్ మళ్ళీ చంద్రబాబు జేబులో మనిషైపోయాడంటూ ప్రచారం మొదలైంది.

ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బిజెపి, జనసేనతో కలిసి టిడిపి పోటి చేస్తుందని చెప్పటం సంచలనంగా మారింది.  దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమైతే జగన్ అధికారంలో ఉండబోయేది మహ అయితే మరో మూడేళ్ళే.

అందుకనే జగన్ పై పోరాటానికి ఇప్పటి నుండే బిజెపి, జనసేనను కలుపుకుని వెళతామంటున్నారు మాజీ మంత్రి. చింతకాయల తాజా ప్రకటనతో చంద్రబాబు ఆలోచనలేంటో అందరికీ అర్ధమైపోయింది. పొత్తులను అధికారికంగా ఇప్పుడే ప్రకటిస్తారా ? లేకపోతే సమయం చూసుకుని ఎన్నికల సమయంలో ప్రకటిస్తారా ? అన్నదే తేలాలి.