పేపర్ లీక్ లో నిజమెంత ?

జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయాల ప్రశ్నపత్రం లీకైందని చంద్రబాబునాయుడు మీడియా సంచలన కథనం ఇచ్చింది. ఆ కథనం కూడా ఫలితాలు వెలువడిన తర్వాత రావటంతో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కథనంలో నిజమెంత అనే విషయాన్ని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జగన్ పై బురద చల్లటానికే కథనాన్ని ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

అందుకు మద్దతుగా పార్టీ నేతలు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. ఏపినిఎస్సీ లో పని చేసే  కంప్యూటర్ ఆపరేటరే ప్రశ్నపత్రాన్ని టైపు చేసినట్లు రాశారు. నిజానికి ప్రశ్నపత్రాన్ని ఎవరూ టైపు చేయరు. ఎక్కడో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లో రహస్యంగా ప్రశ్నపత్రాలను ముద్రిస్తారు. ఎందుకంటే మొన్నటి పరీక్షలకు సుమారు 22 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పైగా పేపర్ సెట్టింగ్ ర్యాండమ్ గా ఎంపికవుతుంది. ప్రశ్నలు తయారు చేసిన నిపుణుడికి కూడా ప్రశ్నపత్రంలో ఏఏ ప్రశ్నలు  వస్తాయో తెలీదు.  ఎందుకంటే నిపుణుల దగ్గర నుండి తీసుకున్న ప్రశ్నలను కంప్యూటర్ కు ఫీడ్ చేస్తే అదే ప్రశ్నలను ఎంపిక చేస్తుంది. ఆ ప్రశ్నలనే ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చి ప్రింట్ చేయిస్తారు. పైగా దాన్ని సీల్ చేసి ఏపిపిఎస్సీకి తెస్తారు.

ఏపిపిఎస్సీలోని ఓ టైపిస్టు ప్రశ్నపత్రాలను టైపు చేసిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. మొత్తం మీద చూస్తే జగన్ పై అక్కసుతోనే ఎల్లోమీడియా కథనం ఇచ్చినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని చాలా చోట్ల ఏబిఎన్ ఛానల్ ప్రసారాలు నిలిచిపోయాయి. అందుకు జగనే కారణమని ఎల్లోమీడియా యాజమాన్యం ఆరోపిస్తోంది. యాజమాన్యం ఎన్ని ఆరోపణలు చేస్తున్నా జగన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఆ అక్కసుతోనే తప్పుడు కథనాన్ని ఇచ్చిందని వైసిపి నేతలంటున్నారు. ఎంఎల్ఏ అంబటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.