తెలుగుదేశంపార్టీ ఏమి చేసినా నాటకీయంగానే ఉంటుంది. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసిపి చేతిలో టిడిపి చావుదెబ్బ తిన్న దగ్గర నుండి ప్రతి విషయాన్ని గోల గోల చేస్తోంది. ఇందుకు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపేసింది. ఇప్పటికి రెండు ఘటనల్లో పెయిడ్ ఆర్టిస్టుల భాగోతం బయటపడటంతో టిడిపి పరువు పోయింది. మళ్ళీ ఇపుడు పెయిడ్ ఆర్టిస్టుల వివాదం టిడిపిని చుట్టుముడుతోంది.
వైసిపి బాధితుల శిబిరమంటూ చంద్రబాబునాయుడు నాలుగైదు రోజులుగా చేస్తున్న గగ్గోలు అందరూ చూస్తున్నదే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తమ పార్టీ కార్యకర్తలపై వైసిపి నేతలు దాడులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వైసిపి దెబ్బకు గ్రామాలను వదిలేసిన బాధితుల కోసం గుంటూరులో శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు రచ్చ చేస్తున్నారు.
ఈ విషయంపైనే హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులనే బాధితులుగా చిత్రీకరిస్తు చంద్రబాబు నానా రచ్చ చేస్తున్నారంటూ ఆరోపించారు. వైసిపి నేతలు ఎవరిపైనా దాడులు చేయలేదంటున్నారు. కొన్నిచోట్ల గొడవలైన విషయం మాత్రం నిజమే అని అంగీకరించారు. రెండు వర్గాల మధ్య గొడవలు జరిగినపుడు అందరిపైనా కేసులు పెట్టామంటున్నారు. టిడిపి కార్యకర్తలపై 43 కేసులు పెడితే వైసిపి కార్యకర్తలపై 37 కేసులు పెట్టామన్నారు.
అంటే సుచరిత చెబుతున్నదే నిజమైతే గొడవకు కారణమైన వారందరిపైనా కేసులు నమోదు చేసినట్లే. అంటే ఇక్కడ కక్షసాధింపు అన్న కోణమే కనబడటం లేదు. అదే సమయంలో శిబిరంలో పెయిడ్ ఆర్టిస్టులను ఉంచి బాధితులంటూ చంద్రబాబు నాటకాలాడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. శిబిరాల్లో ఉన్నవారిలో బాధితులెంత మంది పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది అన్నది తేల్చేస్తామంటున్నారు. ఆ పని చేస్తే వివాదం ముగిసిపోతుంది కదా ?