బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివియల్ నరసింహారావుపై రాష్ట్రంలో ముప్పేట దాడి సాగుతోంది. కాని ఆయనను సమర్థించుతూ విమర్శలకు జవాబు చెప్పేందుకు రాష్ట్రంలో ఒక్క బిజెపి నేత కరవయ్యారు. టిడిపి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల నేతలు వ్యక్తిగతంగా కూడా విమర్శలు సంధి స్తున్నారు. జివియల్ నరసింహారావు ఢిల్లీలో ఒక హోటల్ లో వైసిపి నేతలను కలుసుకున్నారని వైసిపి కి ఏజంట్ గా మారాయని ఆరోపించుతున్నా ఆయన తరపున ఒక్క బిజెపి నేత నోరు విప్పడం లేదంటే ఆశ్చర్యమేస్తుంది. తప్పు అయినా ఒప్పు అయినా పార్టీ నేత ఒకరు చేసిన ప్రకటనలపై విమర్శలు వస్తే ఆ పార్టీ ఇతర నేతలు జవాబు చెప్పడం ప్రతి పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. కాని నరసింహారావు విషయంలో రివర్స్ అయింది. ఎందుకంటే నరసింహారావు ను సమర్ధించుతూ ప్రకటనలు చేస్తే ప్రజల్లో పరువు పోతుందని భయపడుతున్నారు. మరీ టిడిపి నేతలు వర్ల రామయ్య బుచ్చయ్య చౌదరితో పాటు సిపిఐ నేత నారాయణ ఘాటుగా ఆరోపణలు సంధించారు.
ఇంతకీ జివియల్ నరసింహారావు ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు? ఆయన చేసినదేమిటి రాష్ట్రంలో మూడు రాజధానుల రగడ రావణ కాష్ఠంలా రగులుతోంది. రాష్ట్రంలో ఒక్క వైసిపి తప్ప అన్ని పార్టీలు అమరావతిలోనే రాజధాని వుండాలని ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర బిజెపి నేతలు కూడా అమరావతిలోనే రాజధాని వుండాలని రాజధాని రైతుల ఉద్యమంలో పాల్గొన్నారు. రైతులకు అండగా ఉద్యమం సాగిస్తామని సమావేశాల్లో తీర్మానాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలో వుంటుందని అయితే ఈ పాటికే అమరావతి రాజధాని గా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జవాబు చెప్పారు. ఈ ప్రకటనపై ఎవరి భాష్యం వాళ్ళు చెప్ఫుకుంటుండగా పిలవని పేరంటంలాగా జివియల్ నరసింహారావు రాజధాని అంశంలో కేంద్రం పాత్ర ఏమీ వుండదని రాష్ట్ర పరిధిలో వుంటుందని టీకా తాత్పర్యం చెప్పారు.
ఈ ప్రకటన అమరావతి రాజధానిగా వుండాలని పోరాడే పార్టీ నేతలకు మింగుడు పడలేదు. తుదకు బిజెపి నేతలు కూడా ఖంగు తిన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాణిక్యాల రావు లాంటివారు ప్రజల్లో పరువు కాపాడుకునేందుకు తాము ఉద్యమం చేసి అమరావతి రాజధానిగా వుండేందుకు కృషి చేస్తామని ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు.
మొదలే బడ్జెట్లో ఎపికి నిధులు కేటాయించకపోవడం పోలవరం ప్రాజెక్టుకు నిధులు తిరునామం పెట్టడం ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం ఈ పరిస్థితుల్లో జివియల్ నరసింహారావు ప్రకటన పుండుపై కారం రాసినట్లుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు నర్సింహారావును చీల్చి చెండాడుతున్నా రాష్ట్రంలో ఒక్క బిజెపి నేత నోరు విప్పలేకున్నారు